కల్వకుంట్ల కవితపై వేటు తప్పదా?

May 24, 2025


img

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవితని పార్టీ నుంచి బహిష్కరించబోతున్నారా? అంటే అవుననే అనుకోవాలి. ఆమె నిన్న అమెరికా నుంచి హైదరాబాద్‌ తిరిగి వచ్చినప్పుడు స్వాగతం పలికేందుకు బిఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరూ రాలేదు. ఆమెకు దూరంగా ఉండాలని అధిష్టానం సూచించినందునే బిఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరూ రాలేదని భావించవచ్చు. 

కానీ తెలంగాణ జాగృతి సభ్యులు వచ్చారు. వారు కూడా గులాబీ కండువాలు లేకుండా వచ్చారు. విమానాశ్రయం వద్ద కల్వకుంట్ల కవిత జిందాబాద్ అని నినాదాలు చేసి మొక్కుబడిగా ఓ సారి కేసీఆర్‌ జిందాబాద్ అని నినాదం చేశారు. వారు ప్రదర్శించిన ప్లకార్డులలో కల్వకుంట్ల కవిత ఫోటోలు మాత్రమే ఉన్నాయి. కేసీఆర్‌, కేటీఆర్‌ ఫోటోలు కనిపించలేదు. అంటే ఆమె వర్గం కూడా బిఆర్ఎస్ పార్టీకి దూరం కాబోతోందని భావించవచ్చు. 

ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ, “కేసీఆర్‌ చుట్టూ కొన్ని దెయ్యాలున్నాయంటూ చేసిన వ్యాఖ్యలు పార్టీ గీత దాటడంగానే చూడవచ్చు. నిన్న ఆమె చేసిన ఆరోపణలపై బిఆర్ఎస్ పార్టీ ఇంకా స్పందించలేదు. 

ఒకవేళ పార్టీలోనే కొనసాగనిస్తే, ఆమె తీవ్ర అసంతృప్తి, అసహనంతో ఉన్నందున మళ్ళీ మళ్ళీ ఇటువంటి విమర్శలు, ఆరోపణలు చేస్తూనే ఉంటారు. దాని వలన బిఆర్ఎస్ పార్టీలో లుకలుకలు బయటపడతాయి.

కనుక ఆమెపై వేటు వేయడం ఖాయంగానే కనిపిస్తోంది. కానీ ముందుగా ఆమెకు షోకాజ్ నోటీస్ ఇచ్చి వివరణ కోరుతారా లేదా నేరుగా సస్పెండ్ చేస్తారా?అనేది త్వరలో తెలుస్తుంది.


Related Post