కేసీఆర్‌ చుట్టూ దెయ్యాలున్నాయి: కవిత

May 24, 2025


img

బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమెరికా నుండి శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌ తిరిగి వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయం వద్దే ఆమె మీడియాతో మాట్లాడారు. ఇటీవల బయటకు లీక్ అయిన లేఖ రెండు వారాల క్రితం తాను వ్రాసినదే అని ఆమె స్పష్టం చేశారు.

పార్టీలో పలువురు కార్యకర్తలు, సామాన్య ప్రజలు అనుకుంటున్న విషయాలే ఆ లేఖ ద్వారా కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళ్ళాను తప్ప ప్రత్యేకమైనవేమీ లేవని ఆమె అన్నారు. 

కేసీఆర్‌కి తాను రెండు వారాల క్రితం వ్రాసిన లేఖని బయటకు లీక్ అవడం గమనిస్తే బిఆర్ఎస్ పార్టీలో కోవర్టులున్నారని, కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయని స్పష్టమైందని కల్వకుంట్ల కవిత అన్నారు. కేసీఆర్‌ కూతురునైనా నేను వ్రాసిన లేఖ మీడియాకు లీక్ అయితే ఇక పార్టీలో సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏమిటి? అని పార్టీలో అందరూ ఆలోచించుకోవాలన్నారు. 

కేసీఆర్‌ దేవుడు. కానీ ఆయన చుట్టూ కొన్ని దెయ్యాలున్నాయి. అవే ఆయనని తప్పు దారి పట్టిస్తున్నాయన్నారు కల్వకుంట్ల కవిత. కాంగ్రెస్‌, బీజేపిల వలన తెలంగాణకు ఒరిగేదేమీ లేదని కేవలం కేసీఆర్‌ మాత్రమే వాటికి ఏకైక ప్రత్యామ్నాయమని అన్నారు. పార్టీలో చిన్న చిన్న లోపాలు సవరించుకొని, కోవర్టులను ఏరి పారేస్తే బిఆర్ఎస్ పార్టీ ఇక తిరుగు ఉందని కల్వకుంట్ల కవిత అన్నారు.

ఆమె చెప్పిన ఆ కోవర్టులు, కేసీఆర్‌ చుట్టూ ఉన్న దెయ్యాలు ఎవరు?హరీష్ రావా? కేటీఆరా?ఇద్దరూనా? వారితో పాటు ఇంకా ఎన్ని దెయ్యాలున్నాయి?కవిత చేసిన ఈ వ్యాఖ్యలపై కేసీఆర్‌ లేదా బిఆర్ఎస్ పార్టీ తరపున కేటీఆర్‌ ఏవిదంగా స్పందించబోతున్నారు?

ఆమె పార్టీ అంతర్గత విషయాలను బహిరంగంగా మాట్లాడి పార్టీకి నష్టం కలిగించారు కనుక బిఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేస్తారా? లేదా ఆమె చెప్పిన దెయ్యాలను కేసీఆర్‌ వదిలించుకుంటారా? అనే ప్రశ్నలకు నేడో రేపో తప్పక సమాధానాలు లభిస్తాయి.


Related Post