తప్పు చేయకపోతే విచారణకు భయమెందుకు? ఉత్తమ ప్రశ్న

May 23, 2025


img

జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్‌ కేసీఆర్‌, హరీష్ రావులకు నోటీసులు జారీ చేయడం చాలా నేరమన్నట్లు బిఆర్ఎస్ నేతలు చేస్తున్న వాదనలపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌ రెడ్డి ఘాటుగా స్పందించారు. 

సచివాలయం ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ, “ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎటువంటి తప్పులు, లోపాలు, అవినీతి జరుగలేదని బిఆర్ఎస్ పార్టీ భావిస్తున్నట్లయితే కేసీఆర్‌, హరీష్ రావు ఇద్దరూ ధైర్యంగా    కమీషన్ ఎదుట విచారణకు హాజరయ్యి తాము ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవచ్చు కదా? ఏ తప్పు చేయనప్పుడు కమీషన్ ఎదుట విచారణకు హాజరయ్యేందుకు ఎందుకు భయపడుతున్నారు?” అని ప్రశ్నించారు. 

ఉత్తమ్ కుమార్‌ రెడ్డి ఇంకా ఏమన్నారంటే, “కాళేశ్వరం ప్రాజెక్టుని వాళ్ళే డిజైన్ చేశారు.. వాళ్ళే కట్టారు.. వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. అందుకు వారే బాధ్యత వహించాలి కదా?కానీ కమీషన్ నోటీస్ ఇవ్వగానే ఎదురుదాడి ఎందుకు చేస్తున్నారు? 

కాళేశ్వరం ప్రాజెక్టు డిజైను, నిర్మాణం, నిర్వహణ ప్రతీ దానిలో అనేక లోపాలున్నాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆధారిటీ తేల్చి చెప్పింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఓ తెల్ల ఏనుగు వంటిదని కాగ్ పేర్కొంది. కేసీఆర్‌ తమ జేబులు నింపుకునేందుకే రీ డిజైన్ చేయించారు. డీపీఆర్‌లో ఒక లెక్క నిర్మాణంలో మరో లెక్క అన్నట్లు ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల నుంచి అధిక వడ్డీలకు సుమారు రూ.85 వేల కోట్లు అప్పులు తెచ్చి హడావుడిగా నిర్మించారు. 

కానీ అది ఆయన హయంలోనే కూలిపోయి ఎందుకు పనికి రాకుండా పోయింది. కానీ దాని కోసం చేసిన అప్పులు, వడ్డీలు మన తర్వాత తరాలు తీర్చినా తీరేవి కావు. 

కేసీఆర్‌ తన స్వార్ధం కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు తప్ప కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని కాదు. కానీ ఇచ్చామని నిసిగ్గుగా అబద్దాలు చెప్పుకుంటున్నారు. ఈ ప్రాజెక్టు నిజంగా గొప్పదే అయితే మీ హయాంలోనే ఎందుకు కూలిపోయింది?

మేము బాంబులు పెట్టి కూల్చేశామని ఆరోపిస్తున్నప్పుడు మాపై కేసులు ఎందుకు నమోదు చేయలేదు?” అని ఉత్తమ్ కుమార్‌ రెడ్డి ప్రశ్నించారు. 


Related Post