కవిత వ్రాసిన ఒక్క లేఖపై ఎన్ని అభిప్రాయాలో!

May 23, 2025


img

బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన తండ్రి కేసీఆర్‌కు వ్రాసినట్లు చెప్పబడుతున్న లేఖని కాంగ్రెస్ పార్టీయే సృష్టించి మీడియాకి లీక్ చేసిందనే బిఆర్ఎస్ పార్టీ ఆరోపణలపై మంత్రి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘాటుగా స్పందించారు.

“ఇదంతా కేసీఆర్‌ కుటుంబం కలిసి మొదలుపెట్టిన కొత్త డ్రామా. బిఆర్ఎస్ పార్టీలో ఎటువంటి విభేధాలు లేదు. ముఖ్యంగా తండ్రీ కూతుర్ల మద్య లేవు. ఒకవేళ వారు గొడవ పడాల్సివస్తే ఆస్తుల గురించే గొడవ పడాలి తప్ప రాజకీయాల గురించి కానే కాదు. ఎందుకంటే, బిఆర్ఎస్ పార్టీకి భవిష్యత్‌ లేదు. అటువంటి పార్టీపై పట్టు కోసం వాళ్ళలో వాళ్ళు కీచులాడుకోవడం దేనికి?

రాష్ట్రంలో ప్రజలు బిఆర్ఎస్ పార్టీని పట్టించుకోక పోవడంతో ప్రజల దృష్టిని ఆకర్షించడానికే కేసీఆర్‌ & కో ఈ కొత్త డ్రామాలు మొదలుపెట్టారు. కవిత వ్రాసినట్లు చెప్పబడుతున్న ఆ లేఖ ఓ పెద్ద జోక్. ఆమె స్థాయి నేత వ్రాసిన లేఖలా ఉందా అది?ఆ లేఖను మేమే వ్రాశామని ఆరోపిస్తుండటం సిగ్గుచేటు. ఇలాంటి చావుకబారు పనులు చేయాల్సిన కర్మ కాంగ్రెస్‌ పార్టీకి లేదు,” అని అన్నారు. 

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఇందుకు పూర్తి భిన్నంగా స్పందిస్తూ, “కల్వకుంట్ల కవిత వ్రాసిన ఆ లేఖతో ఆమె తండ్రిని నేరుగా కలిసి మాట్లాడలేకపోతున్నారనే విషయం స్పష్టమైంది. అలాగే బిఆర్ఎస్ పార్టీలో నంబర్ 2 స్థానం కోసం ఆమెకు, కేటీఆర్‌, హరీష్ రావుల మద్య పోటీ జరుగుతున్నట్లు అనుమానం కలుగుతోంది.

ఆమెకు కేసీఆర్‌కి మద్య లేదా ఆమెకు కల్వకుంట్ల కుటుంబానికి మద్య ఏమైనా అంతర్గత విభేధాలున్నాయేమో తెలియదు. ఈ లేఖ గురించి ఆమె లేదా బిఆర్ఎస్ నేతలే ప్రజలకు వివరణ ఇవ్వాలి,” అని అన్నారు.    



Related Post