కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్ మాజీ సిఎం కేసీఆర్, మాజీ సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు, మాజీ ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్‌లకు నోటీసులు జారీ చేసి జూన్ 6,7,9 తేదీలలో వరుసగా కమీషన్ ఎదుట విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
కేసీఆర్‌కు నోటీస్ పంపడాన్ని బిఆర్ఎస్ పార్టీ తప్పు పడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించింది. కనుక వారిరువురూ విచారణకు హాజరుకాకపోవచ్చు.
ఇక ఈటల రాజేందర్‌కు నోటీస్ పంపినా బీజేపిలో ఎవరూ ఆయనకు మద్దతుగా స్పందించలేదు. కానీ ఆయనే స్పందిస్తూ,”జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్ నుంచి నాకు ఇంతవరకు ఎలాంటి నోటీసులు అందలేదు. ఒకవేళ అందితే ఓ బాధ్యత గల పౌరుడుగా చట్టాన్ని గౌరవిస్తూ తప్పకుండా కమీషన్ ఎదుట విచారణకు హాజరయ్యయి నాకు తెలిసిన విషయాలన్నీ చెపుతాను.
ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆర్ధిక శాఖ క్లియరెన్స్, సహకారం తప్పనిసరి కానీ ప్రాజెక్ట్ నిర్మాణ పనులతో ఆర్ధిక శాఖకు ఎటువంటి సంబంధమూ ఉండదు. అయినప్పటికీ నా వివరణ అవసరమని కమీషన్ భావిస్తే తప్పకుండా వచ్చి ఇస్తాను.
కమీషన్ ఇప్పటికే ప్రభుత్వ, కాంట్రాక్ట్ కంపెనీకి చెందిన అధికారులు, ఇంజనీర్లను ఈ ప్రాజెక్టు గురించి ప్రశ్నించింది. విజిలెన్స్ ద్వారా కూడా చాలా సమాచారం సేకరించింది. కనుక నన్ను పిలిచినా కొత్తగా ఏం చెప్పగలను? నేను కూడా అదే చెప్తాను కదా?” అన్నారు ఈటల రాజేందర్.
తెలంగాణ ఉద్యమ సమయం నుంచే ఈటల రాజేందర్ కేసీఆర్‌తో కలిసి పనిచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నప్పుడు కేసీఆర్ మంత్రివర్గంలో ఆర్ధిక మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నారు. కనుక కేసీఆర్ గురించి అందరికంటే ఆయనకే బాగా తెలుసు.
కానీ కేసీఆర్ ఆయనని చాలా అవమానకరంగా మంత్రివర్గంలో నుంచి మెడ పట్టుకొని బయటకు గెంటేసి, ఉప ఎన్నికలలో రాజకీయంగా భూస్థాపితం చేయాలని విశ్వ ప్రయత్నం చేశారు.
కనుక ఈటల రాజేందర్ కూడా ఆయనపై రాజకీయ ప్రతీకారం తీర్చుకోవడానికి ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు కమీషన్ నోటీస్ రూపంలో ఆయనకు ఆ అవకాశం వచ్చింది. కనుక విచారణకు హాజరయ్యి కేసీఆర్ నిర్వాకం బయటపెట్టడం ఖాయం.