కాళేశ్వరం కమీషన్ గడువు పొడిగింపు కేసీఆర్‌ కోసమేనా?

May 20, 2025


img

కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై దాదాపు 12 నెలలుగా విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్ గడువు తెలంగాణ ప్రభుత్వం మరో రెండు నెలలు అంటే జూలై 31 వరకు పొడిగిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం ఉన్న ప్రతీ అధికారి, ఇంజనీరుని విచారణ జరిపినందున, ఈ నెలాఖరులోగా కమీషన్ విచారణ ముగించి రాష్ట్ర ప్రభుత్వానికి తుది నివేదికఇవ్వబోతోందని వార్తలు రాగా హటాత్తుగా కమీషన్ గడువు మరో రెండు నెలలు పొడిగించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. 

మాజీ సిఎం కేసీఆర్‌, మాజీ మంత్రి హరీష్ రావులను విచారించకుండానే కమీషన్ విచారణ ముగించబోతోందని వార్తలపై భిన్నాభిప్రాయలు వ్యక్తం అయ్యాయి. 

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, అక్రమాలను ఈ కమీషన్ ద్వారా వెలికి తీసి ప్రజల ముందుంచాలని ఇంత వ్యయప్రయాసలు భరించినప్పుడు, ఈ ప్రాజెక్టుకి కర్త, కర్మ, క్రియ అన్నీ అయిన కేసీఆర్‌, హరీష్ రావులను ప్రశ్నించకుండానే విచారణ ముగించడం అంటే కమీషన్ ఏర్పాటుకి అర్ధమే లేకుండా పోతుందని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.  

ఎఫ్-1 రేసింగ్ కేసులో సాక్ష్యాధారాలు చేతిలో ఉన్నా మాజీ మంత్రి కేటీఆర్‌ని ఏమీ చేయలేకపోయిన కాంగ్రెస్‌ ప్రభుత్వం, ఈ నివేదికతో కేసీఆర్‌, హరీష్ రావులపై చర్యలు తీసుకోలేకపోవచ్చని, కనుక ఈ కమీషన్, విచారణ పేరుతో వారిరువురిపై రాజకీయంగా కాస్త ఒత్తిడి తెచ్చేందుకేనని అందుకే అర్ధాంతరంగా విచారణ ముగించి ఉండవచ్చని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 

కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసుని కూడా ఎఫ్-1 రేసింగ్ కేసులా ఆటకెక్కించేయబోతోందని కొందరు అభిప్రాయ పడ్డారు. 

కారణం ఏదైనప్పటికే, ఈ విమర్శలు, ఊహాగానాలకు చెక్ పెడుతూ తెలంగాణ ప్రభుత్వం కమీషన్ విచారణ గడువుని మరో రెండు నెలలు పొడిగించింది. అంటే ఈసారి కేసీఆర్‌, హరీష్ రావులకు నోటీసులు పంపించి ప్రశ్నించేందుకేనని భావించవచ్చు.


Related Post