ఓ ప్రాజెక్ట్ ఎలా కట్టకూడదో ఉదాహరణ కాళేశ్వరం!

May 15, 2025


img

బుధవారం హైదరాబాద్‌, జలసౌధలో సాగునీటి శాఖలో కొత్తగా నియమితులైన 443 మంది ఇంజనీర్లకు తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడుతూ, “ఓ సాగునీటి ప్రాజెక్టుని ఏవిదంగా నిర్మించకూడదో తెలుసుకునేందుకు అతిపెద్ద ఉదాహరణగా మన కళ్ళ ఎదుటే కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది. 

దశాబ్ధాల క్రితం నిర్మించిన నాగార్జున సాగర్, శ్రీశైలం, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్,  భాక్రానంగల్ వంటి ప్రాజెక్టులు నేటికీ చెక్కు చెదరకుండా లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాయి. కానీ మాజీ సిఎం కేసీఆర్‌ స్వయంగా డిజైన్ చేసి, దగ్గరుండి రూ.1.45 లక్షల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్ళలోనే క్రుంగిపోయింది. 

అదొక్కటే కాదు. ఇటీవలే సీతారామ సాగర్ ప్రాజెక్టులో పిల్లర్లు కూడా క్రుంగిపోయాయి. ఇన్ని లక్షల కోట్లు ఖర్చు చేసి కేసీఆర్‌ నిర్మించిన ప్రాజెక్టులు రాష్ట్రానికి ఉపయోగపడలేదు. కానీ ఆ ప్రాజెక్టుల నుంచి నీళ్ళు పారడం లేదు కానీ కేసీఆర్‌ ఇంట్లోకి నిధులు ప్రవహించాయి. 

ఆ పెద్ద మనిషి కట్టిన ప్రాజెక్టులపై మరికొన్ని వందల కోట్లు ఖర్చు చేసి మరమత్తులు చేయించినా అవి నిలబడతాయనే నమ్మకం లేదు. గట్టిగా వరద వస్తే పేక మేడల్లా కూలిపోయే ప్రమాదం ఉంది. 

కాళేశ్వరం ప్రాజెక్టులో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఇంజనీర్లు, అధికారులందరిపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ నివేదికలో సిఫార్సు చేసింది. నాడు వారందరూ కేసీఆర్‌ ఒత్తిళ్ళకు తలొగ్గకుండా తమ పని చేసి ఉండి ఉంటే నేడు ఇంత చెడ్డపేరు, ఇన్ని సమస్యలు, రాష్ట్రానికి ఇంత నష్టం కలిగేదే కాదు.  

కనుక కొత్తగా నియమితులవుతున్న మీరందరూ భవిష్యత్‌లో ఎవరి ఒత్తిళ్ళకు తలొగ్గకుండా పనిచేయాలి లేకుంటే ఏదోరోజు మీరు కూడా జైలు పాలవుతారు. 

అలాగే ప్రాజెక్టుల విషయంలో ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకోవడం మానుకొని వారి పనిని వారు చేసుకోనీయాలి. కేసీఆర్‌లాగ జొరబడకూడదు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులలో 75 శాతం నిర్మాణాలు పూర్తయిన వాటిని ముందుగా పూర్తిచేసి వినియోగంలోకి తీసుకువచ్చేందుకే ఉత్తమ్ కుమార్‌ రెడ్డికి ఈ శాఖని అప్పగించాను,” అంటూ సిఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వ హయంలో జరిగిన అనేక తప్పులను ప్రస్తావించి వాటిని తమ ప్రభుత్వం సరిచేస్తోందని చెప్పారు. 


Related Post