ఎప్పటికీ బిఆర్ఎస్ పార్టీలోనే ఉంటా: హరీష్ రావు

May 13, 2025


img

ఎప్పటికీ బిఆర్ఎస్ పార్టీలోనే ఉంటా: హరీష్ రావు 

బిఆర్ఎస్ పార్టీలోకి ఎంతోమంది వచ్చారు.. వెళ్ళారు.. ఇక ముందు కూడా ఇది కొనసాగుతూనే ఉంటుంది. కానీ పార్టీ పుట్టినప్పటి నుంచి బిఆర్ఎస్ పార్టీని అంటిపెట్టుకొని పనిచేస్తున్న హరీష్ రావు మాత్రం ఎన్నడూ అటువంటి ఆలోచన కూడా చేయలేదు. అయినప్పటికీ పార్టీలో కేసీఆర్‌, కేటీఆర్‌ల తర్వాత స్థానంలోనే ఉండాల్సి వస్తోంది తప్ప పార్టీ అధ్యక్షుడుగా, ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశాలు లేనందున ఏదో రోజు ఆయన తప్పక పార్టీని వీడుతారని ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి.

ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఒడిపోయినప్పటి నుంచి కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లోనే గడుపుతుండటంతో పార్టీలో కేటీఆర్‌, హరీష్ రావు, కల్వకుంట్ల కవితల మద్య రాజకీయ ఆధిపత్య పోరు సాగుతోందని, కనుక హరీష్ రావు పార్టీని వీడవచ్చని మళ్ళీ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

ఈ నేపధ్యంలో ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించి వాటిని ఖండించారు. “పార్టీలో మా మద్య ఎటువంటి విభేధాలు లేవు. నేను బిఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఓ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలా పనిచేసుకుపోతున్నాను. మా అధ్యక్షుడు కేసీఆర్‌ ఆదేశాలను అప్పయాఉదవో ఇప్పుడూ ఎప్పుడూ కూడా తూచా తప్పకుండా పాటిస్తాను. దీనిలో ఎటువంటి సందేహమూ లేదు. ఇదే మాట నేను గత 25 ఏళ్ళుగా  చెపుతూనే ఉన్నాను. మళ్ళీ చెప్తున్నాను. ఒకవేళ కేటీఆర్‌కి పార్టీ నాయకత్వం అప్పగిస్తే నేను మా అధ్యక్షుడు కేసీఆర్‌ నిర్ణయానికి కట్టుబడి కేటీఆర్‌కి పూర్తిగా సహకరిస్తాను. మరో ఆలోచనే చేయను,” అని హరీష్ రావు చెప్పారు. 

కానీ హరీష్ రావు ఈవిదంగా స్టేట్‌మెంట్‌ ఇవ్వడం, కేటీఆర్‌కి నాయకత్వం అప్పగించవచ్చనే సూచన రెండూ కూడా బిఆర్ఎస్ శ్రేణులకు తప్పుడు సంకేతాలు పంపుతున్నాయని చెప్పక తప్పదు.             


Related Post