మిస్ వరల్డ్ పోటీలపై బిఆర్ఎస్ విమర్శలు.. అవసరమా?

May 10, 2025


img

ఓ పక్క భారత్‌-పాక్‌ మద్య యుద్ధం జరుగుతుంటే, తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి రోమ్ నగరం తగులబడుతుంటే ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్న నియో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారంటూ బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో విమర్శిస్తోంది. 

ఈ విమర్శలు సహేతుకమేనా అంటే కాదనే చెప్పాలి. తెలంగాణలో తిరుగే లేదనుకున్న తమని సిఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ ఓడించి అధికారం చేజిక్కించుకున్నప్పటి నుంచి బిఆర్ఎస్ పార్టీలో ఈ అసహనం మొదలైంది. అది నానాటికీ పెరుగుతూనే ఉంది. అందువల్లే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏం చేస్తున్నా విమర్శించడం బిఆర్ఎస్ పార్టీకి పరిపాటిగా మారింది. 

ఈసారి హైదరాబాద్‌లో మిస్ వరల్డ్-2025 పోటీలు నిర్వహించాలని నిర్ణయించే నాటికి భారత్‌-పాక్‌ మద్య యుద్ధం జరుగుతుందనే చిన్న సంకేతం కూడా లేదు. కనుక హైదరాబాద్‌లో మిస్ వరల్డ్-2025 పోటీలు అట్టహాసంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 

ఓ పక్క యుద్ధం మొదలైనా ఈ పోటీలలో పాల్గొనేందుకు సుమారు 110 దేశాలకు చెందిన సుందరీమణులు హైదరాబాద్‌ చేరుకున్నారు. 

పాకిస్థాన్‌కి హైదరాబాద్‌ చాలా దూరంగా ఉంది. ఒకవేళ హైదరాబాద్‌పై దాడి చేసేందుకు పాక్‌ ప్రయత్నించినా భారత్‌ తిప్పి కొట్టగలదు. కనుక మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొనేవారికి ఎటువంటి ప్రమాదం ఉండదు. అందువల్లే వారిలో ఏ ఒక్కరినీ వారివారి దేశాలు ఈ పోటీల నుంచి విరమించుకొని స్వదేశానికి తిరిగి వచ్చేయమని కోరలేదు కూడా.

మిస్ వరల్డ్ పోటీలకు రాష్ట్ర ప్రభుత్వం, స్పాన్సర్లు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అన్నీ ఏర్పాట్లు చేశారు. కనుక యుద్ధం కారణంగా హటాత్తుగా రద్దు చేస్తే తీవ్రంగా నష్టపోతారు. 

తొలిసారిగా హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించే అవకాశం లభిస్తే నిర్వహించలేక చేతులెత్తేశారని అప్రదిష్ట కూడా కలుగుతుంది. ఈ యుద్ధంతో పాక్‌ పరిస్థితి దయనీయంగా మారగా, భారత్‌పై పెద్దగా ప్రభావం లేదని, మిస్ వరల్డ్ పోటీలు అట్టహాసంగా నిర్వహించడమే  ఇందుకు చక్కని నిదర్శనమని చెప్పుకోవచ్చు కదా? 

అయినా కేటీఆర్‌ ముచ్చటపడితే ఫార్ములా 1 రేసింగ్ నిర్వహించవచ్చు. దాని గురించి గొప్పగా చెప్పుకోవచ్చు. దాని వలన తెలంగాణ ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తుందని, హైదరాబాద్‌ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందని వాదించవచ్చు. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం హైదరాబాద్‌ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడం తప్పుగా కనిపిస్తున్నాయి!

అయినా భారత్‌-పాక్‌ మద్య యుద్ధం జరుగుతుంటే రేవంత్ రెడ్డి, ఆయన మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వెళ్ళి యుద్ధంలో పాల్గొనాలా? ఆ లెక్కన కేసీఆర్‌ అండ్ కో కూడా వెళ్ళి యుద్ధంలో పాల్గొనాలి కదా? 


Related Post