కాంగ్రెస్‌, బీజేపిల మద్య కుల గణన క్రెడిట్ పోటీలు

May 02, 2025


img

ఈసారి జనాభా లెక్కలతో పాటు కుల గణన కూడా చేయిస్తామనే కేంద్రం ప్రకటన తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌ మంత్రులు ఊహించనిదే. కనుక షాక్ అయ్యుంటారు. తెలంగాణలో కుల గణన చేయించామని కనుక బీజేపి పాలిత రాష్ట్రాలలో కూడా కుల గణన చేయించాలని సవాలు విసిరింది వారే! దాంతో కేంద్రాన్ని ఇరుకున పెట్టాలనుకుంటే, కేంద్రానికి లేని ఈ ఐడియాని చేజేతులా ఇచ్చినట్లయింది. ఇంతవరకు కుల గణన రికార్డులు, డేటా తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో సర్వే చేయిస్తే ఆ రికార్డులన్నీ బీజేపి, కేంద్రం చేతిలోకి వెళ్ళిపోతాయి. 

కానీ సిఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి సవాలు విసిరితే అది స్వీకరించిన అమలు చేయబోతోంది కనుక కేంద్రాన్ని తప్పు పట్టలేరు. కనుక కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెపుతూనే, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి వల్లనే కేంద్రం కుల గణనకు సిద్దపడుతోందని సర్ది చెప్పుకున్నారు.

ప్రధాని మోడీ తమ కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను కాపీ కొడుతున్నందుకు తెలంగాణ బీజేపి నేతలు అసూయతో బాధ పడుతున్నారని, అందుకే తమ సర్వే తప్పుల తడక అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు.

కానీ తమ ప్రభుత్వం వద్ద కుల గణన రికార్డులు, అందుకు  అవసరమైన విధివిధానాలు వగైరా ఉన్నందున, ఈ విషయంలో కేంద్రానికి సహకరించేందుకు తాము సిద్దంగా ఉన్నామని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. 


Related Post