పహల్గాం ఉగ్రదాడి నేపధ్యంలో పాకిస్థాన్‌కి వ్యతిరేకంగా పలు చర్యలు చేపట్టిన భారత్ తాజాగా ఆ దేశ పౌర, వాణిజ్య, సైనిక విమానాలకు భారత్ గగనతలం మూసివేసింది. ఈ మేరకు నోటమ్ జారీ చేసింది. ఏప్రిల్ 30 నుంచి మే 23 వరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని పేర్కొంది.
ఇప్పటికే భారత్ విమానాలకు పాకిస్థాన్ తమ గగనతలం మూసివేసింది. ఇప్పుడు భారత్ కూడా మూసివేయడంతో ఇరుదేశాల నుంచి విదేశాలకు రాకపోకలు సాగించే పౌర, వాణిజ్య విమానాలు చుట్టూ తిరిగి వెళ్ళవలసి వస్తోంది.
తాజా నిషేధంతో సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్ తదితర దేశాలకు రాకపోకలు సాగించే పాక్ విమానాలు చైనా, శ్రీలంక మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది.
భారత్ నుంచి విదేశాలకు రోజుకి 800కి పైగా విమానాలు పాక్ గగనతలం మీదుగా ప్రయాణిస్తుంటాయి. అందుకుగాను వాటి నుంచి రోజుకు సుమారు లక్ష డాలర్లు ఫీజు రూపంలో పాకిస్థాన్‌కు లభిస్తుంది. కానీ పాక్ గగనతలం మూసివేయడం వలన ఆ ఆదాయం కోల్పోవడమే కాక, చైనా, శ్రీలంక మీదుగా పాక్ విమానాలు చుట్టూ తిరిగి ప్రయాణించవలసి వస్తున్నందుకు అదనపు భారం కూడా పడుతుంది.
ఇదేవిదంగా భారత్‌కు కూడా అదనపు భారం పడుతుంది. కానీ పాకిస్థాన్ ఉగ్రవాదం, యుద్ధోన్మాదంతో ఉన్నందున పౌర విమానాల ద్వారా కూడా భారత్‌పై దాడి చేసే ప్రమాదం పొంచి ఉంటుంది. కనుక భారత్ భద్రత కోసం ఈ మాత్రం భారం భరించడం చాలా అవసరమే.