హనుమకొండ బిఆర్ఎస్ సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ చేసిన విమర్శలపై సిఎం రేవంత్ రెడ్డి మళ్ళీ నేడు మరోసారి ఘాటుగా స్పందించారు.
నేడు బసవేశ్వర జయంతి ఉత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సిఎం రేవంత్ రెడ్డి, “మొన్న హనుమకొండలో బిఆర్ఎస్ పార్టీ సభ పెట్టుకుంటామంటే మా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఆర్టీసీ బస్సులు ఇచ్చి తోడ్పడితే, సభకి ప్రజలు రాకుండా అడ్డుకున్నారని ఆ పెద్దాయన విమర్శించడం చాలా బాధాకరం.
ఆయన ఆ సభలో ప్రజా సమస్యల గురించి మాట్లాడితే మేము కూడా సంతోషించేవాళ్ళం. కానీ ఆయన కడుపులో విషం పెట్టుకొని మా ప్రభుత్వం, పోలీసుల గురించి నోటికి వచ్చిన్నట్లు మాట్లాడారు.
ఆయన శాసనసభకు రాకుండా ఫామ్‌హౌస్‌లో పడుకొని ఏడాదికి రూ.65 లక్షల జీతం, కాన్వాయ్, పోలీస్ సెక్యూరిటీ పొందుతున్న మాట వాస్తవం కాదా?పని చేయకుండానే ఆయన ప్రభుత్వం నుంచి జీతభత్యాలు తీసుకుంటూ తిరిగి మా ప్రభుత్వం గురించి నోటికి వచ్చిన్నట్లు మాట్లాడారు. కానీ మేము రేయింబవళ్ళు కష్టపడి పనిచేస్తూ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఒకటొకటిగా అమలుచేస్తున్నాము.
రైతు బంధు, ఆరోగ్యశ్రీ, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వీటిలో ఏది ఆగిపోయింది? అన్నీ నడుస్తూనే ఉన్నాయి కదా? శాసనసభకు రాకుండా ఇలాంటి సభలు పెట్టి ప్రజలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టడం ఏరకం రాజకీయం?
ఆయనేవిదంగా రాష్ట్రాన్ని దోచుకున్నారో, మేము ఏవిదంగా పనిచేస్తున్నామో చూస్తూనే తెలంగాణ ప్రజలు ఉన్నారు. కనుక ప్రజలే ఆయనకు మరోసారి గుణపాఠం చెప్తారు,” అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.