ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ స్పెషల్ ఇంటలిజన్స్ బ్యూరో మాజీ ఓఎస్‌డీ ప్రభాకర్ రావు వైద్య చికిత్స పేరుతో అమెరికా పారిపోయిన సంగతి తెలిసిందే.
ఈ కేసు విచారణకు హాజరు కావాలని పోలీసులు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా అరెస్ట్ భయంతో ఆయన హైదరాబాద్ తిరిగి రావడం లేదు. కోర్టు ఆదేశాలను కూడా ఆయన పట్టించుకోలేదు. కనుక ఆయన పాస్ పోర్టు రద్దు చేయించి, సీబీఐ చేత రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయించి, అమెరికా పోలీసులతోనే అరెస్ట్ చేసి రప్పించేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. కనుక ఆయన ఇప్పుడు విచారణకు హాజరవుతానని కానీ ముందస్తు బెయిల్ ఇవ్వాలని షరతు పెట్టారు.
ముందస్తు బెయిల్ కోసం ప్రభాకర్ రావు హైకోర్టులో ఓ పిటిషన్ వేశారు. దానిపై జస్టిస్ జే శ్రీనివాసరావు మంగళవారం విచారణ జరిపినప్పుడు, పోలీసుల తరపు న్యాయవాది సిద్ధార్ధ్ లూధ్రా అభ్యంతరం తెలిపారు. ప్రభాకర్ రావు గత్యంతరం లేకనే హైదరాబాద్ తిరిగివచ్చేందుకు సిద్దపడ్డారని కనుక ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయవద్దని సిద్ధార్ధ్ లూధ్రా వాదించారు.
ముందస్తు బెయిల్ మంజూరు చేసినట్లయితే ఈ కేసు విచారణకి అవరోధం ఏర్పడుతుందని వాదించారు. ఆయనని తప్పని సరిగా అరెస్ట్ చేసి పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తేనే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజాలు బయటపడతాయని సిద్ధార్ధ్ లూధ్రా వాదించారు. ఈ కేసుపై నేడు హైకోర్టు విచారణ కొనసాగబోతోంది.
ఒకవేళ ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసినట్లయితే తక్షణమే హైదరాబాద్ తిరిగి వస్తారు. కానీ పోలీసులు ఆయనని అరెస్ట్ చేయలేరు!
ఒకవేళ న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేయకపోతే ఆయన ఇంకా వీలైనంత కాలం అమెరికాలో ఉండేందుకు ప్రయత్నిస్తారు. కనుక విచారణ ఆలస్యం కావచ్చు! మరి హైకోర్టు ఏం నిర్ణయిస్తుందో మరికొన్ని గంటలలో తెలియవచ్చు.