కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్ నియమించిన సంగతి తెలిసిందే. ఈ నెలాఖరుతో కమీషన్ గడువు ముగుస్తుండటంతో మరొక నెలరోజుల పాటు గడువు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే రెండేసి నెలలు చొప్పున మూడుసార్లు గడువు పొడిగించినందున, ఇదే ఆఖరు పొడిగింపు కావచ్చు.
జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్ కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన ఐఏఎస్ అధికారులు, ఉన్నతాధికారులు, ఇంజనీర్లు, పదవీ విరమణ చేసిన అధికారులు, కాంట్రాక్ట్ కంపెనీ అధికారులు, ఇంజనీర్లకు నోటీసులు జారీ చేసి విచారణకు రప్పించి ప్రశ్నించింది.
ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ సాగునీటి, ఆర్ధిక శాఖల మాజీ మంత్రి హరీష్ రావు, స్థానిక బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసి ప్రశ్నించాల్సి ఉంది. కానీ విద్యుత్ కొనుగోళ్ళు, యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్స్ నిర్మాణాలలో అవకతవకలపై విచారణ జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేరే కమీషన్ నోటీసులు ఇస్తేనే రాని కేసీఆర్, ఈ కమీషన్ విచారణకు హాజరావుతారని అనుకోలేము.
ఒకవేళ కేసీఆర్, హరీష్ రావు తదితరులు హాజరుకాకపోతే, జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్, అదే విషయం నివేదికలో పేర్కొని ముగించి ప్రభుత్వం చేతికి అందిస్తుంది.