జమ్ము కశ్మీర్‌ అభివృద్ధి వల్లనే ఉగ్రదాడి!

April 27, 2025


img

ప్రధాని మోడీ ప్రతీ నెల చివరి ఆదివారంనాడు ఆకాశావాణి  మాద్యమం ద్వారా ‘మన్ కీ బాత్' అనే కార్యక్రమం ద్వారా దేశ ప్రజలతో తన మనసులో ఆలోచనలని పంచుకుంటారు. కనుక ఇవాళ్ళ (ఆదివారం) ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ, “జమ్ము కశ్మీర్‌లో ఉగ్రదాడిలో మన పౌరులు మరణించినందుకు నేను చాలా బాధపడుతున్నాను. 

ఆ దాడి చిత్రాలను చూస్తున్న ప్రతీ భారతీయుడి రక్తం ఆగ్రహావేశాలతో మరిగిపోతోంది. ఈ ఉగ్రదాడిలో ఆత్మీయులను కోల్పోయిన వారందరికీ నా సంతాపం తెలియజేస్తున్నాను. వారందరికీ నేను మాట ఇస్తున్నాను. ఈ ఉగ్రదాడికి పాల్పడినవారిని తప్పకుండా పట్టుకొని శిక్షలు పడేలా చేస్తాను. 

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన అనేక చర్యల కారణంగా జమ్ము కశ్మీర్‌లో మళ్ళీ పాఠశాలలు, కాలేజీలు విద్యార్ధులతో, పర్యాటకులతో పర్యటక ప్రదేశాలు కళకళలాడుతున్నాయి. జమ్ము కశ్మీర్‌లో యువతకు ఇప్పుడు పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి లభిస్తుండటంతో వేర్పాటువాదానికి దూరంగా ఉంటూ హాయిగా జీవిస్తున్నారు. 

దశాబ్ధాలుగా జమ్ము కశ్మీర్‌లో తీవ్ర అరాచక పరిస్థితులు నెలకొని ఉండేవి. ఇప్పుడు మళ్ళీ చాలా ప్రశాంతమైన పరిస్థితి నెలకొంది. ఈ మార్పులన్నీ భారత్‌, జమ్ము కశ్మీర్‌ వ్యతిరేఖ శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయి. అందువల్లే ఉగ్రదాడికి పర్యాటకులను ఎంచుకున్నారు. 

తద్వారా జమ్ము కశ్మీర్‌లో మళ్ళీ అరాచక పరిస్థితులు నెలకొన్నాయని దుష్ప్రచారం చేయాలనుకుంటున్నారు. కానీ నేను వారి కుట్రలు సాగనీయను. జమ్ము కశ్మీర్‌ మళ్ళీ పూర్వ వైభవం సాధించేందుకు ఏమేమి చేయవచ్చో అవన్నీ చేస్తానని దేశ ప్రజలందరికీ మాట ఇస్తున్నాను,” అని అన్నారు. 


Related Post