తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి, మజ్లీస్ అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, పలువురు మంత్రులు, ఆ రెండు పార్టీల ఎమ్మెల్యే, నేతలు, కార్యకర్తలు శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి జమ్ము కశ్మీర్ ఉగ్రదాడి మృతులకు సంతాపం తెలిపారు.
ఆ తర్వాత సిఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “దివంగత ప్రధాని ఇందిరాగాంధీ పాకిస్థాన్‌కి రెండు యుద్ధాలతో గట్టిగా బుద్ధి చెప్పారు. ఆమె ధైర్య సాహసాలు చూసి దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఆమెను దుర్గామాతగా అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోడీజీ.. మీరు కూడా ఆమెలాగే పాకిస్థాన్‌పై యుద్ధం ప్రకటించండి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ని స్వాధీనం చేసుకొని ఆ దేశానికి గట్టిగా బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇందుకు ఇదే తగిన సమయం. దేశ ప్రజలందరూ మీకు అండగా ఉంటారు,” అని అన్నారు.
సిఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ సూచనని ఆయన పక్కనే ఉన్న అసదుద్దీన్ ఓవైసీ అంగీకరిస్తారా? ప్రధాని మోడీకి చేసిన ఈ సూచనపై కాంగ్రెస్ అధిష్టానానికి, రాష్ట్ర కాంగ్రెస్ మంత్రులు, పార్టీ నేతలకు ఎటువంటి అభ్యంతరం లేదని సిఎం రేవంత్ రెడ్డి చెప్పగలరా? అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనంత మాత్రాన్న ఈ విషయంలో మోడీ ప్రభుత్వ నిర్ణయాలను సమర్ధించబోరని అందరికీ తెలుసు.
కాంగ్రెస్ పార్టీ కూడా పాకిస్థాన్ విషయంలో ఎప్పుడూ మెతక వైఖరి ప్రదర్శిస్తుంటుందనేది రహాస్యమేమీ కాదు. పాక్‌పై భారత్ సర్జికల్ స్ట్రైక్ చేస్తే చేయలేదని ఆ దేశ పాలకులకు రాహుల్ గాంధీ వంతపాడారు కదా?కనుక ఇప్పుడు మాత్రం మోడీ ప్రభుత్వ నిర్ణయాలకి కాంగ్రెస్ అధిష్టానం మద్దతు ఇస్తుందని ఎలా అనుకోగలము? అటువంటప్పుడు సిఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీకి ఈ సూచనని ఏవిదంగా చూడాలి?
సమయం లేదు, సమరమే సమాధానం..!!
ఇండియన్ ఆర్మీ ఇందిరమ్మను గుర్తుకు తెచ్చుకుని పాకిస్తాన్ అంతు చూడండి, ఇండియన్ ఆర్మీకి మద్దతుగా దేశం నిలబడుతుంది..!!#PAHALGAMTERRORISTATTACK pic.twitter.com/SMCQG4G7ZM