భారత్-పాకిస్థాన్ మద్య ఉద్రిక్తతల నుంచి రాజకీయ మైలేజ్ పొందాలని ఇరుదేశాలలో రాజకీయ పార్టీలు తహతహలాడుతున్నాయి. ఇటువంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ, తమ దేశ ప్రజలలో సెంటిమెంట్ రగిలించి ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
ఆ పార్టీ అధినేత బిలావల్ భుట్టో నిన్న సుక్కూర్ అనే ప్రాంతంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ, “సింధూ నదిపై పూర్తి హక్కులు మా దేశానికే ఉన్నాయి. దానిపై భారత్‌కు ఎటువంటి హక్కులు లేవు. కానీ సింధూ జలాలు పాకిస్థాన్‌లోకి ప్రవహించకుండా అడ్డుకోవాలని భారత్ ప్రయత్నిస్తే అప్పుడు దానిలో భారతీయుల రక్తమే ఏరులై పారుతుంది,” అంటూ తీవ్రంగా హెచ్చరించారు.
ఇటువంటి మాటలతోనే పాక్ ప్రజలలో భావోద్వేగాలు రెచ్చగొట్టి తమ పార్టీ వైపు ఆకర్షించవచ్చని పీపీపీ అధినేత భావిస్తున్నట్లున్నారు. భారత్‌లో కూడా పలువురు రాజకీయ నాయకులు ఈవిదంగానే మాట్లాడుతూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇటువంటి సమయంలో ఇటువంటి మాటలు ఇరు దేశాల మద్య ఉద్రిక్తతలు మరింతగా పెంచుతాయి. ఉద్రిక్తతలు ఇంకా పెరిగితే ఇరు దేశాలకు ‘అణు ప్రమాదం’ కూడా పొంచి ఉంది.