కేంద్ర హోం శాఖ ఉత్తర్వుల మేరకు పర్యాటక వీసాలపై తెలంగాణకు వచ్చిన పాకిస్థాన్ పౌరులు తక్షణం తిరిగి వెళ్ళిపోవాలని డీజీపీ జితేందర్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. వైద్య చికిత్సకు వచ్చినవారు ఈ నెల 29లోగా మిగిలినవారు 27లోగా పాకిస్థాన్ తిరిగి వెళ్ళిపోవాలని సూచించారు. ఈ నెల 30 వరకు వాఘా బోర్డర్ నుంచి పాకిస్థాన్ తిరిగి వెళ్ళేందుకు అనుమతిస్తామని చెప్పారు.
పాకిస్థాన్ నుంచి తాత్కాలిక వీసాలతో వచ్చినవారు హైదరాబాద్‌లో మొత్తం 250 మంది ఉన్నారని వారందరూ తక్షణం తిరిగివెళ్ళిపోవాలని సూచించారు. ఈ నెలాఖరు తర్వాత ఎవరైనా హైదరాబాద్ లేదా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా ఉన్నట్లు గుర్తిస్తే వారిని అరెస్ట్ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
దీర్గకాలిక వీసాలపై ఉంటున్నవారికీ, ప్రత్యేక మినహాయింపులతో ఉంటున్నవారికీ ఈ ఆదేశాలు వర్తించవని డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాకిస్తానీలను తిరిగి వెళ్ళిపోవాలని ఆదేశించడంతో తాత్కాలిక, పర్యాటక వీసాలపై వచ్చిన వారు, అక్రమంగా ఉంటున్నవారిలో కొంతమంది అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. వారి కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. కానీ ఈ సమస్య ఒక్క తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాదు దేశంలో అన్ని రాష్ట్రాలలో ఇదే సమస్య ఉంది. కనుక వారందరినీ గుర్తించి వెనక్కు తిప్పి పంపడం లేదా అరెస్ట్ చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవడం ఇప్పుడు దేశంలో పోలీసులకు సవాలుగా మారింది.