రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన బిల్లులు, నిర్ణయాలపై గవర్నర్, రాష్ట్రపతి నిర్ధిష్ట కాలంలో తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాలని లేకుంటే వాటిని వారు ఆమోదించిన్నట్లే పరిగణించవచ్చని ఇటీవల సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
ఆ తీర్పు ఆధారంగా తమిళనాడు ప్రభుత్వం అప్పుడే గవర్నర్ వద్ద పెండింగులో ఉన్న పది బిల్లులకి చట్ట రూపం కల్పిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది కూడా.
కనుక బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ పెంచాని తెలంగాణ శాసనసభ చేసిన బిల్లు విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పుని అనుకూలంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయబోతోందా?అంటే మంత్రి పొన్నం ప్రభాకర్ అవుననే అంటున్నారు.
మంగళవారం హైదరాబాద్, నోవాటేల్ హోటల్లో సీఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ , “శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించిన బీసీ రిజర్వేషన్స్ బిల్లు రాష్ట్రపతి ఆమోదం కోసం పంపాము. సుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రకారం రెండు నెలల్లోగా రాష్ట్రపతి తన నిర్ణయం తెలపాల్సి ఉంటుంది. కనుక బీసీ రిజర్వేషన్ బిల్లు గురించి కాంగ్రెస్ శ్రేణులు ప్రజలను చైతన్య పరచాల్సిన అవసరం ఉంది,” అని అన్నారు.
అంటే ఒకవేళ రాష్ట్రపతి ఈ బిల్లుని తిరస్కరించినా పునః పరిశీలించాలని మరోసారి పంపితే అప్పుడు ఆమోదించక తప్పదు. కనుక ఈసారి బీసీ రిజర్వేషన్స్ అమలుచేయగలమని తెలంగాణ ప్రభుత్వం నమ్మకంతో ఉన్నట్లే ఉంది.