జనసేన అధ్యక్షుడు, ఏపీ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గత కొంత కాలంగా తమిళనాడు రాజకీయాలపై ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే.
వచ్చే ఏడాది జరుగబోయే తమిళనాడు శాసనసభ ఎన్నికలలో బీజేపి, ప్రధాన ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకె పొత్తులు పెట్టుకొని పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. తమ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఎడపాడి పళనిస్వామిని ఖరారు చేశాయి.
వాటి నిర్ణయాన్ని అభినందిస్తూ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో ఓ లేఖ పోస్ట్ చేశారు. మంచి పాలనానుభవం ఉన్న పళనిస్వామి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే తమిళనాడుకి ఖచ్చితంగా మేలు జరుగుతుందని ఆ లేఖలో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
బీజేపి దక్షిణాది రాష్ట్రాలలో ఇంతవరకు ఒక్క కర్ణాటకలో మాత్రమే అధికారంలోకి రాగలిగింది. గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలవడంతో ఆ రాష్ట్రం కూడా బీజేపి చేజారిపోయింది.
ఆంధ్రాలో టీడీపీ, జనసేనలతో పొత్తులు పెట్టుకునందున కూటమి ప్రభుత్వంలో బీజేపి భాగస్వామి కాగలిగింది. తెలంగాణలో చాలా బలహీనంగా ఉండే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది కానీ బీజేపి ఎంతగా ప్రయత్నిస్తున్నా అధికారంలోకి రాలేకపోతోంది.
తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. తమిళనాడులో రజనీకాంత్‌ని బీజేపిలోకి రప్పించేందుకు లేదా కనీసం మద్దతు ప్రకటింపజేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు.
కనుక సినీ నటుడుగా తమిళనాడు ప్రజలకు చిర పరిచితుడైన పవన్ కళ్యాణ్‌ని అస్త్రంగా ఉపయోగించుకొని అన్నాడీఎంకెతో కలిసి తమిళనాడులో అధికారంలోకి రావాలని బీజేపి భావిస్తోంది. పవన్ కళ్యాణ్ కూడా బీజేపికి తోడ్పడేందుకు సిద్దమేనని సూచిస్తున్నట్లుంది ఈ లేఖ.