ఈ నెల 27న బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభని హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించబోతోంది. కనుక పద్దతి ప్రకారం లిఖిత పూర్వకంగా సభకు పోలీసుల అనుమతి కోరింది. సభకు భద్రత, ట్రాఫిక్ నియంత్రణ కొరకు పోలీసులను మోహరించి అవసరమైన ఏర్పాట్లు చేయవలసిందిగా కోరింది. కానీ ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు సభ నిర్వహించేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు.
దీనిపై బిఆర్ఎస్ నేతలు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఓ రాజకీయ పార్టీగా రజతోత్సవ సభ నిర్వహించుకునే హక్కు తమకు ఉందని కానీ పోలీసులు అనుమతి నిరాకరిస్తూ తమ రాజకీయ హక్కుకి భంగం కలిగిస్తున్నారని, కనుక తమ సభకు అనుమతించాల్సిందిగా పోలీసులను ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు.
దీనిని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ప్రతివాదులుగా పేర్కొనబడిన రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శికి, వరంగల్ సీపీ, కాజీపేట ఏసీపీకి నోటీసులు జారీ చేసి తదుపరి విచారణని ఏప్రిల్ 17కి వాయిదా వేసింది.
బిఆర్ఎస్ సభకు పోలీసులు అనుమతించకపోయినా కొన్ని షరతులతో హైకోర్టు తప్పక అనుమతిస్తుందని అందరికీ తెలుసు. కనుక తెలంగాణ ప్రభుత్వం బిఆర్ఎస్ సభని అడ్డుకునే ప్రయత్నం చేయడం వలన బిఆర్ఎస్ పార్టీ చేసే విమర్శలు భరించడమే తప్ప మరే ప్రయోజనం ఉండదు. అదే సభకు అనుమతించి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి, సిఎం రేవంత్ రెడ్డికి చాలా గౌరవంగా, హుందాగా ఉంటుంది కదా?