సుంకాల విషయంలో వెనక్కు తగ్గిన ట్రంప్‌

April 10, 2025


img

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌సుంకాల విషయంలో వెనక్కు తగ్గారు. భారత్‌తో సహ 75 దేశాలపై పెంచిన సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేస్తున్నామని ప్రకటించారు. ఆయా దేశాలు ప్రతీకార చర్యలకు పాల్పడకుండా, సుంకాల విషయంలో తమతో చర్చలకు వచ్చినందున వాటిపై తాత్కాలికంగా అదనపు సుంకాలు వసూలు చేయబోమని ట్రంప్‌ చెప్పారు. 

ఆయా దేశాలు ఎప్పటిలాగే తమ ఎగుమతులపై 10శాతం సుంకాలు చెల్లిస్తే సరిపోతుందని ట్రంప్‌ చెప్పారు. అయితే చైనా తమపై ప్రతీకార సుంకాలు విధించినందున దానికి ఈ మినహాయింపు ఉండదని, చైనా దిగుమతులపై మరో 21 శాతం సుంకాలు పెంచుతున్నామని ట్రంప్‌ చెప్పారు. 

సుంకాల విషయంలో ట్రంప్‌ దుందుడుకు నిర్ణయాల కారణంగా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఆ కారణంగా 75 దేశాల ప్రతినిధులు తమ దేశాలను కరుణించమని వేడుకున్నారని, అందుకే వాటికి ఊరట కల్పించానని ట్రంప్‌ చెప్పుకున్నారు.

కానీ ట్రంప్‌ నిర్ణయాల వలన అమెరికా సంస్థలు, మార్కెట్లు కూడా నష్టపోతుండటంతో తీవ్ర విమర్శలు, ఒత్తిళ్ళు ఎదుర్కొంటున్నారు. తాను వెనక్కి తగ్గడానికి అదీ ఓ కారణమని ట్రంప్‌ చెప్పుకోలేరు కదా? ఏది ఏమైనప్పటికీ ట్రంప్‌ వెనక్కు తగ్గడంతో మళ్ళీ భారత్‌తో సహా ప్రపంచ దేశాల ఆర్ధిక, వాణిజ్య లావాదేవీలు యధాప్రకారం కొనసాగుతాయి.    

ట్రంప్‌ తాజా ప్రకటనతో అమెరికాతో సహా నష్టాలలో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్స్ మళ్ళీ వేగంగా కొలుకొని లాభాల బాట పట్టాయి. అయితే నేడు మహావీర్ జయంతి సందర్భంగా భారత్‌ షేర్ మార్కెట్‌కు సెలవు కనుక ట్రంప్‌ నిర్ణయం ప్రభావం ఏవిదంగా ఉందో తెలియదు. 


Related Post