భారత్‌తో దోస్తీకి చైనా సిద్దమట!

April 09, 2025


img

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ చైనాపై 104 శాతం సుంకాలతో విరుచుకు పడుతుండటంతో చైనా ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కనుక ఇప్పుడు మళ్ళీ భారత్‌తో సహా ఇరుగు పొరుగు ఆసియా దేశాలతో సంబంధాలు బలపరుచుకోవాలని ఆ దేశాధ్యక్షుడు షీ జిన్‌ పింగ్ అన్నారు. ట్రంప్‌ని ఎదుర్కోవడంలో భారత్‌తో సహా ఆసియా దేశాలు తమతో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. 

దశాబ్ధాలుగా మన దేశానికి చైనా పక్కలో బల్లెంలాగే ఉంది. నేటికీ సరిహద్దులో భారత్‌ భూభాగాలలోకి చైనా సైనికులు జొరబడుతూనే ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్ తమ దేశంలో భాగమని వాదిస్తూనే ఉంది. చైనా చావుక ఉత్పత్తులతో భారత్‌ని ముంచెత్తుతూ దేశంలో పరిశ్రమలని దెబ్బ తీస్తూనే ఉంది. పాకిస్థాన్‌తో చేతులు కలిపి భారత్‌కి వ్యతిరేకంగా కుట్రలు చేస్తూనే ఉంది. శ్రీలంక, నేపాల్, బాంగ్లాదేశ్ వంటి దేశాలకు భారీగా అప్పులు ఇచ్చి వాటిని తమ కనుసన్నలలో భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించేలా చేస్తోంది. 

ఇందుకు తాజా ఉదాహరణగా ఇటీవల చైనా పర్యటనకు వెళ్ళిన బాంగ్లాదేశ్ ప్రభుత్వం ముఖ్య సలహాదారు మహ్మద్ యూనస్ “భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలను ‘ఢాకా’ మాత్రమే కాపాడగలదని” వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

కనుక భారత్‌ని దెబ్బ తీసేందుకు చేయకూడాని పనులన్నీ చేస్తున్న చైనా, ఇప్పుడు ట్రంప్‌ ఒత్తిడి కారణంగా భారత్‌తో దోస్తీకి సిద్దమంటోంది. తమతో కలిసి రావాలని కోరుతోంది. చైనాతో చేతులు కలపాల్సిన అవసరం భారత్‌కు ఉందా?


Related Post