మనల్నే ప్రజలు వద్దనుకుంటే.. కేసీఆర్‌ కామెంట్స్

April 05, 2025


img

ఈ నెల 27న హన్మకొండలో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ జరుగబోతోంది. ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ శుక్రవారం తన ఫామ్‌హౌస్‌లో సభ ఏర్పాట్ల గురించి పార్టీ ముఖ్య నేతలతో చర్చిస్తున్నప్పుడు, కాంగ్రెస్‌ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 

“తెలంగాణ రాష్ట్రం సాధించి ఎంతగానో అభివృద్ధి చేసి చూపిన మనల్నే ప్రజలు వద్దనుకున్నప్పుడు ఏమీ చేయకుండా కబుర్లతో కాలక్షేపం చేస్తున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలని మళ్ళీ గెలిపిస్తారా? కాంగ్రెస్‌ పాలన ఏవిదంగా ఉంటుందో నేను ముందే ప్రజలను పదేపదే హెచ్చరించాను. కానీ కాంగ్రెస్‌ మాయ మాటలు, భూటకపు హామీలు నమ్మి మోసపోయారు. కాంగ్రెస్‌ పాలనతో ప్రజలు వేసారిపోయారు. కనుక ఎప్పుడు ఎన్నికలు జరిగినా మనల్నే గెలిపిస్తారు. మనం మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం. 

అంత వరకు నాయకులందరూ ప్రజల మద్యనే ఉంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫ్యల్యాలను ఎండగడుతూ, ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడుతుండాలి. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను బట్టి తప్పకుండా వారందరూ రాజీనామాలు చేయాల్సి రావచ్చు. కనుక ఉప ఎన్నికలు ఎదుర్కొనేందుకు అందరూ సిద్దంగా ఉండాలి,” అని కేసీఆర్‌ అన్నారు. 

కేసీఆర్‌, బిఆర్ఎస్ పార్టీ నేతలు ఈవిదంగా చెప్పుకోవడం విచిత్రమేమీ కాదు కానీ ఆయన చెప్పిన ఈ మాటలను కాంగ్రెస్‌ ప్రభుత్వం తేలికగా తీసుకుంటే దానికే ప్రమాదం. కనుక అధికారంలోకి రాలేక పదేళ్ళు ఎన్ని కష్టనష్టాలు భరించామో గుర్తుంచుకోవాలి. ప్రజలు కేసీఆర్‌ని కాదనుకొని తమకు ఎందుకు అధికారం కట్టబెట్టారో, తమ నుంచి ఏమి ఆశిస్తున్నారో కాంగ్రెస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎప్పుడూ మరిచిపోకూడదు. 


Related Post