కంచ గచ్చిబౌలిలో హెచ్‌సీయూ పరిధిలో ఉన్న 400 ఎకరాల భూవివాదంపై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణం చెట్లు నరకడం నిలిపివేయాలని స్టే విధించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ప్రతిపక్షాలు, హెచ్‌సీయూ విద్యార్ధులు, హైకోర్టు, సుప్రీంకోర్టు అందరూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ప్రభుత్వాన్ని తప్పు పట్టడంతో ఇప్పుడు ముందుకు సాగలేని పరిస్థితి నెలకొంది. కనుక ఈ సమస్య పరిష్కారం కోసం సంబందిత వర్గాలతో చర్చలు జరిపేందుకు ముగ్గురు మంత్రులతో ఓ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు సిఎం రేవంత్ రెడ్డి.
ఈ కమిటీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, దుదిళ్ళ శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభ్యులుగా ఉంటారు. సుప్రీంకోర్టు స్టే విధించి తీవ్రంగా హెచ్చరించినందున ఇక రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగలేని పరిస్థితి నెలకొంది. కనుక మంత్రుల సబ్ కమిటీ ఏర్పాటు చేయడమంటే అభ్యంతరాలపై ప్రభుత్వం స్పందించి ఈ వివాదంలో నుంచి గౌరవ ప్రదంగా బయటపడే ప్రయత్నంగానే భావించవచ్చు.