శాసనసభ సమావేశాల కంటే ప్లీనరీ ముఖ్యమా సార్?

April 03, 2025


img

రాజకీయాలలో నిలద్రొక్కుకున్న ఏ పార్టీకైనా అవిర్భావ దినోత్సవం జరుపుకోవడం గర్వకారణమే. బిఆర్ఎస్ పార్టీ 24 సంవత్సరాలు పూర్తిచేసుకొని 25వ వసంతంలోకి అడుగుపెట్టబోతోంది. ఈ నెల 27న హన్మకొండ జిల్లాలో జరుగబోయే పార్టీ రజతోత్సవ సభ మరింత గర్వకారణంగా నిలుస్తుంది. 

లక్షమందికిపైగా జనసేకరణ చేసి ఆ సభను అట్టహాసంగా నిర్వహించాలనుకోవడం, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవడం, వాటి కోసం ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ పార్టీ నేతలతో చర్చించడం ఏ మాత్రం తప్పు కాదు. చాలా అవసరం కూడా. 

కానీ తొమ్మిదిన్నరేళ్ళు రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రిగా, గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్‌ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నప్పుడు, శాసనసభ సమావేశాలకు విధిగా హాజరుకావడం ఆయన కనీస బాధ్యత కదా? దాని కోసం ఆయన ప్రభుత్వం నుంచి నెలకు సుమారు రూ.2.50 లక్షలు జీత భత్యాలు కూడా తీసుకుంటున్నారు కదా? కానీ కేసీఆర్‌ ఈ ఏడాదిన్నరలో కేవలం రెండుసార్లు మాత్రమే హాజరు కోసం శాసనసభకు వెళ్ళారు. 

శాసనసభ సమావేశాలకు ఎందుకు హాజరు కావడం లేదని సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పదేపదే ప్రశ్నిస్తున్నా జవాబు కూడా చెప్పడం లేదు. 

శాసనసభకు రావడానికి ఇష్టపడని కేసీఆర్‌ బిఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబందించి ఏర్పాట్లని పర్యవేక్షించడానికి ఎప్పటికప్పుడు పార్టీ నేతలతో సమావేశమవుతూనే ఉన్నారు. అంటే శాసనసభ సమావేశాలకు హాజరవడం కంటే పార్టీ ప్లీనరీ సమావేశమే ముఖ్యమని కేసీఆర్‌ భావిస్తున్నారా? ముఖ్యమంత్రి పదవిలో ఉంటే తప్ప శాసనసభకు రాకూడదని భీష్మించుకుంటే ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఫామ్‌హౌస్‌లో హాయిగా కూర్చోవచ్చు కదా?అని సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే వేరొకరిని ప్రజలు ఎన్నుకుంటారని సిఎం రేవంత్ రెడ్డి, మంత్రుల సూచిస్తున్నారు కదా?



Related Post