ఈరోజు (ఏప్రిల్ 3) తెలంగాణ మంత్రి విస్తరణ జరుగుతుందని, నలుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని నాలుగైదు రోజుల క్రితం జోరుగా వార్తలు వచ్చాయి. కానీ మంత్రులు ప్రమాణ స్వీకారం ప్రస్తావన లేకుండానే ఈ రోజు గడిచిపోయింది.
మంత్రి పదవుల కోసం కె జానారెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంకా పలువురు సీనియర్ నేతలు పోటీ పడుతుండటంతో కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి పెరిగిపోయింది.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు హోం మంత్రి పదవి కావాలని, ఒకవేళ వేరే ఏదైనా శాఖ ఇచ్చినా సర్దుకుపోతానని, కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఫోన్ కాల్ కోసం ఎదురుచూస్తున్నాని అన్నారు.
కానీ ఇప్పటికే ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట రెడ్డికి మంత్రి పదవి ఇచ్చినందున, రాజగోపాల్ రెడ్డికి ఇస్తే, పదవులు ఆశించి భంగపడిన సీనియర్లు ఆగ్రహిస్తే సమస్యలు వస్తాయని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది.
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఇవాళ్ళ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “నాకు తప్పకుండా మంత్రి పదవి లభిస్తుందని భావిస్తున్నాను. ఒకవేళ ఇవ్వకుంటే పార్టీలో గౌరవం లేనప్పుడు ఇంకా కొనసాగడం కంటే రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోవడం మంచిదని భావిస్తున్నాను,” అని అన్నారు.
కనుక రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం చాలా రిస్క్ అవుతుంది. కానీ ఎన్నికల సమయంలోనే ఆయనకు తప్పకుండా మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చింది. కనుక ఇవ్వకపోతే ఆయన అలిగి పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయే ప్రమాదం పొంచి ఉంది.
మంత్రివర్గ విస్తరణ అంటే తేనె తుట్టెని కదపడమే అవుతుంది కనుక కొన్ని రోజులు వాయిదా వేయడమే మంచిదని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది.