ఏమిటీ వక్ఫ్ బిల్?

April 02, 2025


img

మోడీ ప్రభుత్వం బుధవారం వక్ఫ్ బిల్లుని లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అసలు ఈ వక్ఫ్ బిల్లు ఏమిటి? దీనిని ముస్లిం సమాజం, ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయాయి. కానీ అన్ని పార్టీలు దీనిపై రాజకీయ మైలేజ్ కోసం భిన్నమైన వాదనలు వినిపిస్తున్నందున అయోమయం నెలకొంది. ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు లభించడం లేదు. 

ఇంతవరకు దేశంలో ముస్లిం మత సంస్థలకు చెందిన ఆస్తుల విషయంలో ఏదైనా వివాదాలు ఏర్పడితే వక్ఫ్ ట్రిబ్యునల్‌దే తుది తీర్పుగా సాగుతోంది. వక్ఫ్ బోర్డు తీర్పుని హైకోర్టు, సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు వీలు ఉండేది కాదు.  

కానీ మోడీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న వక్ఫ్ చట్ట సవరణలను పార్లమెంటు ఆమోదం లభిస్తే, ఇకపై వక్ఫ్ బోర్డులో జిల్లా జడ్జితో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త కార్యదర్శి స్థాయి అధికారిని నియమించవచ్చు. ఏదైనా ఆస్తి వివాదం ఏర్పడితే ఆ అధికారిదే తుది నిర్ణయం. వక్ఫ్ ట్రిబ్యునల్ తీర్పులపై ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే హైకోర్టులో సవాలు చేయవచ్చు.

ఇంతవరకు వక్ఫ్ బోర్డులో ముస్లింలు మాత్రమే సభ్యులుగా ఉండాలని నిబంధన ఉంది. కానీ ఈ బిల్లుకి ఆమోదం లభిస్తే వక్ఫ్ బోర్డులో అన్యమతస్థులు సభ్యులుగా చేరవచ్చు. 

ఇంతకాలం సరైన పత్రాలు లేకుండా ముస్లిం మతపరమైన అవసరాలకు వాడుతున్న భూములను వక్ఫ్ భూములుగా పరిగణిస్తుండేవారు. కానీ ఈ బిల్లుకి ఆమోదం లభిస్తే ఆ నిబంధన తొలగిపోతుంది. అటువంటి భూములు వివాదాస్పద భూముల జాబితాలో చేర్చబడతాయి. 

అందుకే ఈ వక్ఫ్ చట్ట సవరణలన్నీ దేశంలో ముస్లింల హక్కులను బలవంతంగా గుంజుకోవడమే అని కాంగ్రెస్‌, మిత్ర పక్షాలు వాదిస్తున్నాయి. ప్రస్తుతం లోక్‌సభలో దీనిపై వాడివేడిగా వాదోపవాదాలు జరుగుతున్నాయి. 


Related Post