ప్రభుత్వం విరమించుకోవాలి: ప్రకాష్ రాజ్

April 02, 2025


img

గచ్చిబౌలి భూముల విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం సరికాదని ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. ప్రభుత్వం ఆదాయం సమకూర్చుకోవడానికి పచ్చటి చెట్లను నరికి ప్రకృతిని దెబ్బ తీయడం మంచిది కాదని, దీని కోసం ప్రభుత్వంతో పోరాడుతున్న విద్యార్ధులు, పౌరులకు తాను సంఘీభావం తెలియజేస్తున్నానని ప్రకాష్ రాజ్ తెలిపారు. 

ఈ సమస్యపై పోరాటం ఉదృతం చేసి ప్రకృతిని, హెచ్‌సీయూ భూములు కాపాడుకునేందుకు అందరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. #సేవ్ హెచ్‌సీయూబయో డైవర్సిటీ #ఆక్సిజన్ నాట్ ఫర్ సెల్, #సేవ్ హెచ్‌సీ అని హ్యాష్ ట్యాగ్స్ పెట్టి జస్ట్ ఆస్కింగ్,” అని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు.    

హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో ఉన్న 400 ఎకరాలు ప్రభుత్వానివే. దాని యాజమాన్య హక్కులు ప్రభుత్వానికే ఉన్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఇందుకు సంబందించి పత్రాలను నిన్న మీడియాకు విడుదల చేసింది. 

అయితే ఇక్కడ ఆ భూముల యాజమాన్య హక్కుల గురించి ఎవరూ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు. ఆ భూములలో పెరిగిన పచ్చటి చెట్లను, వాటిలో జీవిస్తున్న పక్షులు, జంతువులకు నష్టం కలిగించవద్దని మాత్రమే చెపుతున్నారు. 

కానీ ప్రభుత్వం వినకపోవడంతో ప్రతిపక్షాలు, విద్యార్ధులు, ప్రకాష్ రాజ్ వంటి ప్రముఖులు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే హైడ్రా కూల్చివేతలతో వ్యక్తిగతంగా, రాజకీయంగా సిఎం రేవంత్ రెడ్డి, ఆయన ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత ఏర్పడింది. మూసీ ప్రక్షాళన విషయంలో కూడా ఇదే జరిగింది. 

ఇదివరకు సిఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో కూడా ఇలాగే భూసేకరణకు ప్రయత్నించినప్పుడు ఆయా గ్రామాల ప్రజలు, ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అప్పుడు ప్రభుత్వం వెనక్కు తగ్గాల్సి వచ్చింది. కానీ అలా తగ్గడం వలన రాజకీయంగా ఈ సమస్య పెద్దది కాకుండా బ్రేక్ వేయగలిగింది. 

ఇప్పుడు గచ్చిబౌలి భూముల విషయంలో అందరూ వారిస్తున్నప్పటికీ ప్రభుత్వం ముందుకు సాగితే ఇంకా వ్యతిరేకత పెరుగుతుంది. 

కనుక ఇప్పుడు ఈ భూముల విషయంలో కూడా ప్రభుత్వం వెనక్కు తగ్గి ఈ వివాదం నుంచి బయటపడుతుందా లేక ముందుకు సాగి రాజకీయంగా నష్టపోతుందా?



Related Post