ఏపీకి ఆదర్శంగా తెలంగాణ ప్రభుత్వం..

April 01, 2025


img

ఏపీలో గత 5 ఏళ్ళ జగన్‌ పాలనలో కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా ఏటా లక్షల టన్నుల రేషన్ బియ్యం ఆఫ్రికా దేశానికి ఎగుమతి అవుతుండేది. ఆ కుంభకోణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురిపై ప్రస్తుత ఏపీ ప్రభుత్వం కేసులు నమోదు చేసి విచారణ జరుపుతోంది.

కానీ అదే కాకినాడ పోర్టు నుంచి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఫిలిపిన్స్ దేశానికి బియ్యం ఎగుమతి చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. తెలంగాణలో గత ఖరీఫ్ సీజనులో 153 లక్షల టన్నులు బియ్యం ఉత్పత్తి కాగా రాబోయే సీజనులో మరో 122 లక్షల టన్నులు బియ్యం వస్తుంది. తెలంగాణ ప్రజల వినియోగానికి సరిపడా బియ్యం ఉంచుకున్నా ఇంకా లక్షల టన్నుల బియ్యం మిగిలిపోతోంది. కనుక ఫిలిపిన్స్ ప్రభుత్వంతో 8 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతికి తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. మొదటి విడతలో సుమారు రూ.45 కోట్లుపైగా విలువచేసే 12,500 టన్నుల బియ్యం ఎగుమతికి తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌ రెడ్డి సోమవారం కాకినాడ పోర్టు నుంచి ఆ జెండా ఊపి ప్రారంభించారు. వియత్నాంకు చెందిన షిప్పులో ఈ బియ్యాన్ని ఫిలియిన్స్ దేశానికి ఎగుమతి అవుతోంది. 

తెలంగాణకు ఒక్క సీ-పోర్టు లేనప్పటికీ పొరుగు రాష్ట్రంలో పోర్టుని వినియోగించుకొని బియ్యం ఎగుమతి చేసి రైతులకు, ప్రభుత్వానికి ఆదాయ మార్గం ఏర్పరచుకుంది. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తోంది.


Related Post