గచ్చిబౌలిలో సర్వే నంబర్ 25లో 400 ఎకరాలు వేలం వేసి ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం అనుకుంటే, వివాదాస్పదంగా మారింది. అధికార ప్రతిపక్షాలు పూర్తి భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్ధులు కూడా ఈ ప్రతిపాదనని వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టారు.
ప్రభుత్వ వాదన: 2003లో ఈ భూమిని అప్పటి ప్రభుత్వం ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అప్పగించింది. కానీ ప్రాజెక్టు మొదలుపెట్టకపోవడం వలన 2006 లో భూకేటాయింపులు రద్దు చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆ సంస్థ హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది.
కానీ ఈ న్యాయపోరాటాలు మొదలు పెట్టక మునుపే కంచ గచ్చిబౌలిలో యూనివర్సిటీ అధీనంలో ఉన్న 534.28 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించింది. దానికి బదులుగా యూనివర్సిటీకి గోపన్నపల్లిలో సర్వే నంబర్స్ 36,37లో 397.16 ఎకరాలు యూనివర్సిటీకి కేటాయించింది.
కానీ ఆ తర్వాత యూనివర్సిటీ మనసు మార్చుకొని మొదట హైకోర్టుకి ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళడంతో నాటి రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ ప్రభుత్వాలు, నేటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం న్యాయపోరాటాలు చేశాయి.
చివరికి 2024, మే3న సుప్రీంకోర్టు ఆ పిటిషన్ కొట్టివేయడంతో ఆ భూములపై ప్రభుత్వానికి మళ్ళీ హక్కు లభించింది. 2024, జూలైలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ సమక్షంలో రెవెన్యూ అధికారులు, 400 ఎకరాలు సర్వే చేసి హద్దులు ఖరారు చేశారు. 2003 నుంచి 2024 జూలై వరకు జరిగిన ఈ ప్రక్రియకు సంబందించిన పత్రాలను ముఖ్యమంత్రి కార్యాలయం సోమవారం మీడియాకు విడుదల చేసింది.