ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం ఇందిరా భవన్‌లో 16 రాష్ట్రాల నుంచి వచ్చిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ నేడు సమావేశమయ్యారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై జిల్లా కాంగ్రెస్ (డీసీసీ) కేంద్రంగా పార్టీ నిర్మాణం జరగాలని, జిల్లా స్థాయి నేతల సూచనలు, అభిప్రాయాల మేరకే టికెట్ల కేటాయింపు జరపాలని నిర్ణయించారు. కాంగ్రెస్ సిద్దాంతాలు, విధానాలను గ్రామస్థాయి వరకు ప్రజలలోకి తీసుకువెళ్ళేందుకు జిల్లా స్థాయి కాంగ్రెస్‌ని కీలక పాత్ర వహించేలా చేయాలని నిర్ణయించారు.
ఏ పార్టీ అయినా గ్రామస్థాయి నుంచి బలోపేతంగా ఉంటేనే రాణించగలుగుతుంది. ఒకప్పుడు ప్రతీ గ్రామంలో కాంగ్రెస్ జెండాలు రెపరెపలాడుతుండేవి. కానీ ఎన్నికలలో భారీగా ఖర్చు పెట్టగల స్థోమత ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టిందో అప్పటి నుంచి గ్రామ స్థాయిలో కాంగ్రెస్ బలహీనపడింది.
అన్ని రాజకీయ పార్టీలు ఇదే చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయిని పూర్తిగా విస్మరించడంతో దెబ్బ తింది. చాలా ఆలస్యంగానైనా ఈ తప్పును గుర్తించి సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ నేడు తీసుకున్న ఈ నిర్ణయాలకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండగలదా?అంటే అనుమానమే.
ఎన్నికలు లేని ఈ సమయంలో ఇటువంటి మంచి ఆలోచనలు ఎన్ని చేసినప్పటికీ, ఎన్నికల గంట మ్రోగగానే ఢిల్లీ కేంద్రంగా టికెట్ల కోసం పైరవీలు మొదలైపోతాయి. అలా పైరవీలు చేయగలిగినవారికే టికెట్స్ లభిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.
కానీ నేడు తీసుకున్న ఈ నిర్ణయాలకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండగలిగితే తప్పకుండా మళ్ళీ పూర్వ వైభవం సాధించగలదు.