పార్టీ ఫిరాయించిన 10 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని లేదా వారు తప్పనిసరిగా రాజీనామాలు చేయాల్సి వస్తుందని, అప్పుడు ఉప ఎన్నికలు జరుగుతాయని, జరిగితే ఆ 10 సీట్లను మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పదేపదే చెపుతున్నారు.
ఆయన మాటలపై సిఎం రేవంత్ రెడ్డి నిన్న శాసనసభలో స్పందిస్తూ, “2014 నుంచి 2023 వరకు ఆయన (కేసీఆర్) అనేక మంది విపక్ష ఎమ్మెల్యేలను బిఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. వారిలో కొంతమందికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. కానీ వారిపై అనర్హత వేటు పడలేదు. ఎవరూ రాజీనామాలు చేయలేదు.
అప్పుడున్న రాజ్యాంగమే ఇప్పుడూ ఉంది. అప్పుడు ఉన్న రూల్ బుక్కే ఇప్పుడూ ఉంది. ఏదీ మారలేదు. మరి అటువంటప్పుడు ఉప ఎన్నికలు వస్తాయని ఎలా అనుకుంటున్నారు? ఉప ఎన్నికలు రావు. కానీ వస్తాయని భ్రమలో ఉంటే మీ ఇష్టం,” అని అన్నారు.
జమిలి ఎన్నికల గురించి మాట్లాడుటూ, “ఒకవేళ జరిగితే 2029లోనే జరుగుతాయి తప్ప 2028లో తెలంగాణ శాసనసభ గడువు ముగుస్తుందని ముందుగా నిర్వహించరు. అంటే మా ప్రభుత్వం అదనంగా మరో ఆరు నెలలు అధికారంలో ఉండబోతోందన్న మాట!,” అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.
మాజీ బిఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యని ఉద్దేశించి, “ఆనాడు ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు ఆయన పంచె కట్టుకొని తిరుగుతుంటే, అలా తిరిగితే మంత్రి పదవి ఊడిపోతుందని చెప్పాను. చెప్పిన్నట్లుగానే ఆయన ఉప ముఖ్యమంత్రి, మంత్రి పదవీ రెండూ పోయాయి. ఆ అమాయకుడే ఇప్పుడు వారం రోజులలో ఉప ఎన్నికలు వస్తాయంటూ హడావుడిగా తిరుగుతున్నారు,” అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.