తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి నేడు స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో రూ. 800 కోట్ల విలువగల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా శివునిపల్లిలో జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ బిఆర్ఎస్ నేతలు వారి అధినేత కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు.
“తెలంగాణ సాధించినందున కేసీఆర్ ‘తెలంగాణ గాంధీ’ అని బిఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారు. గాంధీజీ ఏనాడూ మద్యం ముట్టలేదు. సంపూర్ణ మధ్య నిషేధం కొరకు పోరాడారు. తన ఆశ్రమంలోనో లేదా నిరుపేదల మురికివాడలలోనో ఎక్కువగా ఉండేవారు.
గాంధీజీ చాలా నిరాడంబరమైన జీవితం గడిపేవారు. కానీ కేసీఆర్‌కి ప్రతీరోజూ మందు లేనిదే నిద్రపట్టదు. అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలకు, అవినీతికి పాల్పడి లక్ష కోట్ల ఆస్తులు పోగేసుకున్నారు. వేల ఎకరాలు పోగేసుకుని వాటిలో ఫామ్‌హౌస్ నిర్మించుకొని చాలా విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు.
ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, చట్టసభలు అంటే కేసీఆర్‌కి గౌరవమే లేదు. అందుకే శాసనసభకు రాకుండా ఫామ్‌హౌస్‌లో పడుకొని జీతం తీసుకుంటున్నారు. ఇటువంటి వ్యక్తిని ‘తెలంగాణ గాంధీ’ ఎలా అవుతారు?
తెలంగాణ రాష్ట్రం కొరకు తమ సర్వస్వం అర్పించిన కొండా లక్ష్మణ్ బాపూజీ లేదా ప్రొఫెసర్ జయశంకర్‘తెలంగాణ గాంధీ’ అవుతారు తప్ప కేసీఆర్ కానే కాదు,” అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.
కేసీఆర్ అభివృద్ధిపేరుతో ఏకంగా రూ.8.29 లక్షల కోట్లు అప్పులు చేసిపోయారు. ఈ 15 నెలల్లో వాటి అసలు కింద రూ.64,000 కోట్లు, వడ్డీ కింద రూ.84,000 కోట్లు కలిపి సుమారు రూ. 1,53,000 లక్షల కోట్లు చెల్లించాను. అంత సొమ్మే గనుక ఇప్పుడు నా చేతుల్లో ఉండి ఉంటే రాష్ట్రంలో 3 లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించి ఇచ్చేవాడిని.
కేసీఆర్ చేసిన అప్పుల భారం మోస్తూనే ఈ 15 నెలల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాము. రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేశాము. కేసీఆర్ ఎగవేసిన రైతుబంధు చెల్లించాము. ఇంకా పలు పధకాలు అమలుచేస్తూనే ఉన్నాము.
మరోపక్క ఇటువంటి అభివృద్ధి పనులు కూడా చేస్తూనే ఉన్నాము. కేసీఆర్ 9 ఏళ్ళు అధికారంలో ఉండి చేయనివన్నీ మేము 15 నెలల్లో చేసి చూపిస్తున్నాము.
మీరు మాకు 5 ఏళ్ళు పాలించమని అవకాశం ఇచ్చారు. కానీ మేము అధికారం చేపట్టిన నెల రోజుల నుంచే మమ్మల్ని గద్దె దించేస్తామని కేసీఆర్ బెదిరిస్తూనే ఉన్నారు. ఇదెక్కడి న్యాయం?” అంటూ సిఎం రేవంత్ రెడ్డి సునిశిత విమర్శలు, వ్యాఖ్యలు చేశారు.