నేటి నుంచి తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఆనవాయితీ ప్రకారం ముందుగా ఈరోజు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తర్వాత సమావేశాలు రేపటికి వాయిదా వేసి బీఏసీ కమిటీ సమావేశం నిర్వహిస్తారు. దానిలో సభలో చర్చించాల్సిన అంశాలు, సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలో నిర్ణయిస్తారు.
తొలిరోజు సమావేశానికి మాజీ సిఎం కేసీఆర్ హాజరవుతారని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. అయితే శాసనసభ సమావేశాలు ప్రతీరోజూ హాజరు కాకపోవచ్చునని బిఆర్ఎస్ నేతల మాటలను బట్టి తెలుస్తోంది. రేపు లేదా ఎల్లుండి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేరోజున, మళ్ళీ ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరుగుతున్న రోజున మాత్రమే కేసీఆర్ శాసనసభ సమావేశానికి హాజరవుతారని సమాచారం.
నిన్న తెలంగాణ భవన్‌లో పార్టీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించిన తర్వాత కేసీఆర్ నందినగర్‌లో తన నివాసానికి చేరుకున్నారు. అక్కడ మూడు రోజులు ఉంటారని బిఆర్ఎస్ నేతలు చెప్పడం చూస్తే, ఆ తర్వాత ఆయన మళ్ళీ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కి వెళ్ళిపోతారని, కనుక ప్రతీరోజూ శాసనసభ సమావేశాలకు హాజరు కాకపోవచ్చునని అర్దమవుతోంది.
శాసనసభలో కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు. కానీ శాసనసభ, మండలిలో చెరో ముగ్గురు చొప్పున డెప్యూటీ లీడర్లని నియమించాలని కేసీఆర్ నిర్ణయించడం కూడా ఇదే సూచిస్తోంది.
స్పీకర్ అనుమతి తీసుకోకుండా శాసనసభకు 60 రోజులకు మించి హాజరు కాకపోతే, నిబంధనల ప్రకారం స్పీకర్ ఆ సీటు ఖాళీ అయిన్నట్లు ప్రకటించవచ్చు. కనుక కేసీఆర్ కేవలం హాజరు వేయించుకునేందుకే శాసనసభ సమావేశాలకు హాజరవుతున్నారా?అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.