తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ 15 నెలల్లో సుమారు 30సార్లుపైగా ఢిల్లీకి వెళ్ళివచ్చారు. అంటే సగటున నెలకు రెండుసార్లు వెళ్ళి వస్తున్నారన్న మాట! ఈరోజు మరోసారి ఢిల్లీ బయలుదేరబోతున్నారు.
మార్చి 20న ఎమ్మెల్యేల కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగబోతున్నాయి. వాటికి అభ్యర్ధుల పేర్లు ఖరారు చేసేందుకు ఢిల్లీ వెళుతున్నారు. సిఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నేడు ఢిల్లీ వెళుతున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదేపదే ఢిల్లీ వెళ్ళివస్తుంటారని, అక్కడి నుంచే పాలన సాగుతుందని, కీలక నిర్ణయాలన్నీ కాంగ్రెస్ అధిష్టానమే తీసుకుంటుంది తప్ప తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కాదని ఎన్నికల సమయంలోనే కేసీఆర్ పదేపదే చెప్పారు. ఆయన చెప్పినట్లే జరుగుతోంది.
తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఉన్నారు. తెలంగాణ పీసీసీ దానికి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. సిఎం రేవంత్ రెడ్డితో సహా పార్టీలో పలువురు సీనియర్లున్నారు. ఇంతమంది ఉన్నా నలుగురు ఎమ్మెల్సీ అభ్యర్ధుల పేర్లను ఖరారు చేయడానికి ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ అధిష్టానం ఆమోదం తీసుకోక తప్పడం లేదు.
మాది జాతీయపార్టీ కనుక ఇది చాలా సహజం. తప్పు కాదని కాంగ్రెస్ నేతలు సమర్ధించుకోవచ్చు. కానీ రాష్ట్రానికి సంబందించిన ఇటువంటి అంశాలపై పీసీసీకి సొంతంగా నిర్ణయం తీసుకునే అధికారం లేకపోవడం, ప్రతీ నిర్ణయానికి కాంగ్రెస్ అధిష్టానం ఆమోదం తప్పనిసరంటే తెలంగాణ ప్రజలకు తాము ఎటువంటి సందేశం పంపుతున్నామో కాంగ్రెస్ నేతలు ఓసారి ఆలోచిస్తే వారికే మంచిది.
ఎన్నికల షెడ్యూల్:
మార్చి 3 నుంచి 10 వరకు: నామినేషన్స్
మార్చి 13 వరకు: నామినేషన్స్ ఉపసంహరణకు గడువు
మార్చి 20: ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్
మార్చి 20: సాయంత్రం 5 నుంచి ఓట్లు కౌంటింగ్, ఫలితాల వెల్లడి.
శాసనసభలో ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా ఈ ఎన్నికలు జరుగుతాయి కనుక కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల బలంతో 4 సీట్లు, బిఆర్ఎస్ పార్టీ ఒక్క ఎమ్మెల్సీ సీటు గెలుచుకోగలవు.
ఈ సీట్లకు 5 నామినేషన్స్ మాత్రమే దాఖలైతే ఎన్నికల అవసరం లేకుండా నామినేషన్స్ ఉప సంహరణ తర్వాత ఏకగ్రీవంగా గెలిచిన అభ్యర్ధులని ప్రకటిస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ 5వ సీటుని కూడా దక్కించుకునేందుకు మరో నామినేషన్ వేస్తే మార్చి 20న పోలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది.