బీసీల నేతగా ఎదిగేందుకే తీన్‌మార్ మల్లన్న ప్రయత్నిస్తున్నారా?

March 05, 2025


img

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ తీన్‌మార్ మల్లన్న తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై కాస్త ఆలస్యంగా ఘాటుగా స్పందించారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “నేను కాంగ్రెస్‌ ప్రభుత్వం విధానాలను ప్రశ్నిస్తున్నందునే నన్ను పార్టీలో నుంచి సస్పెండ్ చేశారు. నన్ను బయటకు పంపిస్తే ఏమైనా చేయొచ్చని సిఎం రేవంత్ రెడ్డి అనుకుంటున్నట్లున్నారు. కానీ నా ఈ సస్పెన్షన్‌తోనే బీసీల ఉద్యమం మొదలుపెట్టబోతున్నాము. 

గతంలో మమ్మల్ని అందరూ అణచివేస్తే అణిగిమణిగి పడి ఉండేవాళ్ళం. ఆనాటి బీసీలం కాము మేము. ఇప్పుడు అన్ని విషయాలపై పూర్తి అవగాహనతో రాజకీయ చైతన్యంతో మమ్మల్ని అణచివేయాలనుకునేవారికి ఎదురు తిరిగి పోరాడుతున్నాము.

 అందువల్లే కులగణనని నేను వ్యతిరేకించాను. దాని వలన బీసీలకు నష్టం కలుగుతుందనే నిరసన తెలిపేందుకు దాని ప్రతులు తగుల బెట్టాను. బీసీల కోసం ఈ తప్పు ఒకసారి వందసార్లు చేయడానికి సిద్దంగా ఉన్నాను. 

ఈ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తామంటే చూస్తూ ఊరుకోను. తప్పకుండా ఎదురు తిరిగి పోరాదుతాను. నా ఈ పోరాటం ఈ సస్పెన్షన్‌తోనే మొదలుపెడుతున్నానని గుర్తుంచుకునేందుకే సస్పెన్షన్‌ లెటర్‌కి ఫోటో ఫ్రేమ్ కట్టించి నా కార్యాలయంలో పెట్టుకుంటున్నాను,” అంటూ దానిని మీడియాకు చూపారు. 

ఇంతకాలం ఆర్‌.కృష్ణయ్య బీసీల నాయకుడుగా మంచి గుర్తింపు పొందారు. ఆయన ఇప్పుడు రాజ్యసభ సభ్యుడుగా ఎన్నికవడంతో ఆ స్థానాన్ని తీన్‌మార్ మల్లన్న భర్తీ చేయాలనుకుంటున్నారేమో? ఆయన మాటలను బట్టి రాష్ట్రంలో బీసీలకు నాయకుడుగా ఎదిగేందుకు తీన్‌మార్ మల్లన్న ప్రయత్నాలు మొదలుపెట్టినట్లనిపిస్తోంది.


Related Post