వరంగల్ జిల్లా మామూనూరులో విమానాశ్రయం నిర్మించేందుకు పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఎయిర్ పోర్టు ఆధారిటీ ఉత్తర్వులు జారీ చేయడంతో ఇన్నేళ్ళకు తెలంగాణ రాష్ట్రానికి మరో విమానాశ్రయం ఏర్పాటు కాబోతోందని ప్రజలు చాలా సంతోషిస్తున్నారు.
అయితే రాష్ట్ర కాంగ్రెస్, బీజేపిలు దీని క్రెడిట్ కోసం కీచులాడుకోవడం చూసి ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు. జిల్లాకు చెందిన బీజేపి నేతలు తమ అనూచారులను వెంటబెట్టుకొని ఈరోజు ఉదయం మామూనూరు విమానాశ్రయం నిర్మించబోతున్న చోటికి చేరుకొని అక్కడ ప్రధాని మోడీ ఫోటో పెట్టి పూలు జల్లి అక్కడే టెంట్ వేసి చిన్న సభ నిర్వహించి, ప్రధాని మోడీ వల్లనే మామూనూరులో విమానాశ్రయం ఏర్పాటు కాబోతోందని చెప్పుకుంటున్నారు.
అడే సమయంలో అక్కడికి జిల్లా కాంగ్రెస్ నేతలు తమ అనుచరులను వెంటబెట్టుకుని అక్కడకు రావడంతో ఇరువర్గాల మద్య వాగ్వాదాలు, ఘర్షణ మొదలైంది. కానీ పోలీసులు వెంటనే ఇరు వర్గాలను చెదరగొట్టి ఘర్షణలు పెద్దవి కాకుండా నివారించారు.
మామూనూరు విమానాశ్రయం ఏర్పాటు విషయం తెలియగానే రాష్ట్ర కాంగ్రెస్ మంత్రులు స్వాగతిస్తూ సిఎం రేవంత్ రెడ్డి చొరవ వల్లనే విమానాశ్రయం వస్తోందని చెప్పుకున్నారు.
కానీ బీజేపి నేతలు తాము కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విమానాశ్రయం సాధించుకున్నామని చెప్పుకున్నారు. ఇంకా కాగితాల మీదే ఉన్న మామూనూరు విమానాశ్రయం క్రెడిట్ కోసం కాంగ్రెస్, బీజేపి నేతలు పోటీపడుతున్నాయన్న మాట. నవ్వాలా ఏడ్వాలా?