ఊహించిన్నట్లే కాంగ్రెస్ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్‌మార్ మల్లన్నపై సస్పెన్షన్ వేటు పడింది. ఆయనని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డి ప్రకటించారు. ఈ మేరకు నోటీస్ జారీ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు ఆమోదం, కుల గణన, రిజర్వేషన్స్ అంశాలపై విభేదిస్తూ తీన్‌మార్ మల్లన్న సిఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీసీలకు అన్యాయం చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. అంతకు ముందు పలు సందర్భాలలో రేవంత్ రెడ్డి ఈ 5 ఏళ్ళు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉంటారని ఆ తర్వాత బీసీ ముఖ్యమంత్రి వస్తారని అన్నారు.
పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి, పార్టీకి, ప్రభుత్వానికి అప్రదిష్ట కలిగేవిదంగా మాట్లాడుతున్నందుకు వారం రోజులలోగా సంజాయిషీ ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఫిబ్రవరి 5న తీన్‌మార్ మల్లన్నకి షోకాజ్ నోటీస్ పంపింది. కానీ నేటికీ ఎటువంటి సంజాయిషీ ఇవ్వకపోగా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.
తీన్‌మార్ మల్లన్న ఎన్నో ఎదురుదెబ్బలు, సవాళ్ళు ఎదుర్కొని రాజకీయాలలో ఈ స్థాయి (ఎమ్మెల్సీ)కి వచ్చారు. కానీ బీసీ రిజర్వేషన్స్ విషయంలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే నేరుగా పార్టీ పెద్దలకి, లేదా సంబంధిత మంత్రి లేదా ముఖ్యమంత్రికి చెప్పాలి. కానీ మీడియా ముందుకు వచ్చి బహిరంగంగా విమర్శలు చేసి తన రాజకీయ జీవితాన్ని తానే పాడుచేసుకున్నారు.