ఎస్ఎల్‌బీసీ సొరంగంలో ప్రమాదం జరిగి అప్పుడే వారం రోజులవుతున్నందున లోపల చిక్కుకున్న 8 మంది సజీవంగా బయటపడే అవకాశాలు దాదాపు లేన్నట్లే.
నిన్న హరీష్ రావు అక్కడకు వచ్చినప్పుడు తమ హయాంలో ఎస్ఎల్‌బీసీ సొరంగం పనుల కోసం రూ.3,300 కోట్లు ఖర్చు చేసిందని చెప్పగా, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనకు జవాబిస్తూ తమ ప్రభుత్వం రూ.3,900 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు.
అంటే రెండు ప్రభుత్వాలు మొత్తం రూ. 7,200 కోట్లు ఖర్చు చేసిన్నట్లు స్పష్టమవుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్ కోసం అంతకు ముందు ప్రభుత్వాలు అనేక వేలకోట్లు ఖర్చు చేశాయి.
టన్నల్ బోరింగ్ యంత్రం మరమత్తులకే సుమారు రూ.100-150 కోట్లు వరకు ఖర్చు చేశారంటే అ యంత్రం ఖరీదు, విదేశాల నుంచి దానిని ఇక్కడకు తెప్పించడానికి మరెన్ని వందల కోట్లు ఖర్చు అయ్యాయో ఎవరికీ తెలీదు.
ఈ ప్రమాదంలో మనుషుల ప్రాణాలను ఎలాగూ కాపాడే పరిస్థితి కనబడటం లేదు. కనీసం ఆ యంత్రం కూడా ఇప్పుడు ఉపయోగించుకోలేని పరిస్థితి ఏర్పడిందిప్పుడు.
ప్రమాదం జరిగిన చోటికి చేరుకునేందుకు ఆ యంత్రంలో కట్టర్ యంత్రం పొడవు 150 మీటర్లు. శిధిలాలు పడి ఇప్పటికే అది ధ్వంసం అయ్యింది. కనుక దానిని బయటకు తీసేందుకు గ్యాస్ కట్టర్స్‌తో ముక్కలు ముక్కలుగా కట్ చేసి బయటకు తరలిస్తున్నారు. కనుక ఇక ఆయంత్రం ఇక ఎందుకూ పనికిరాదు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న మీడియాతో మాట్లాడుతూ, “శిధిలాలు తొలగించి అంతా క్లియర్ చేసిన తర్వాత రెండు నెలల్లో మళ్ళీ సొరంగం తవ్వకం పనులు మొదలుపెడతామని” చెప్పారు. అంటే మళ్ళీ వందలో వేల కోట్లు ఖర్చు చేసి కొత్త కట్టర్ యంత్రం విదేశాల నుంచి కొనబోతున్నారన్న మాట!
ఇక్కడే ఈ ప్రాజెక్ట్ నిలిపివేసినా ఇంతవరకు పెట్టిన వేలకోట్లు వృధా అవుతాయి. కనుక మళ్ళీ వందలో వేల కోట్లు ఖర్చు చేసి కొత్త యంత్రం కొనుగోలు చేసి తెస్తే అప్పుడైనా సొరంగంలో మిగిలిన 37 కిమీ పొడవు తవ్వగలరా?తవ్వలేకపోతే?మరింత నష్టం కదా? కనుక ఎస్ఎల్‌బీసీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆలోచించి ముందుకు సాగాల్సి ఉంటుంది.