ఓ పక్క విమర్శిస్తూ సహకారం ఆశిస్తే లభిస్తుందా?

February 27, 2025


img



తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి బుధవారం ప్రధాని మోడీతో ఢిల్లీలో సమావేశమైనప్పుడు హైదరాబాద్‌ మెట్రో పొడిగింపు, డ్రై పోర్టు నిర్మాణం, రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం, మూసీ ప్రక్షాళన, సెమీ కండక్టర్ తదితర ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులు, నిధులు మంజూరు చేసి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇవన్నీ తెలంగాణ అభివృద్ధికి చాలా అవసరమే. 

అయితే రాష్ట్రంలో రాజకీయాల కోసం సిఎం రేవంత్ రెడ్డి తరచూ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులను అమెరికా నుంచి హైదరాబాద్‌కి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తమకి సహకరించకుండా, నిందితులను కాపాడుతోందని, కేసీఆర్‌, కేటీఆర్‌ అరెస్ట్‌ కాకుండా అడ్డుకునేందుకే కేంద్రం ఈవిదంగా చేస్తోందని సిఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. 

హైదరాబాద్‌ మెట్రో రైల్ ప్రాజెక్టు పొడిగించకుండా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అడ్డుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోందని పదేపదే సిఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తుంటారు. 

రాష్ట్ర రాజకీయాలలో బీజేపి, బిఆర్ఎస్ పార్టీలపై పైచేయి సాధించేందుకు నిత్యం ఈవిదంగా విమర్శలు చేస్తూ, వాటిని ప్రధాని మోడీ పట్టించుకోకుండా తెలంగాణకు ఉదారంగా సాయపడాలని సిఎం రేవంత్ రెడ్డి ఆశిస్తున్నారు. గతంలో కేసీఆర్‌ కూడా ఈవిదంగా ప్రవర్తించడం వల్లనే కేంద్రం సహకారం కొరవడిందని అందరికీ తెలుసు. 

కానీ సిఎం రేవంత్ రెడ్డి ఎన్ని విమర్శలు చేస్తున్నప్పటికీ, కేసీఆర్‌లా అహంభావం ప్రదర్శించకుండా ప్రధాని మోడీని కలిసి రాష్ట్ర అవసరాల గురించి వివరించి సహకారం కోరుతున్నారు. ఆయన రాష్ట్ర రాజకీయాల కోసమే తమపై అటువంటి విమర్శలు చేస్తున్నారనే విషయం ప్రధాని మోడీకి కూడా తెలుసు. కనుక సిఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందిస్తారా లేదో?        



Related Post