గత శుక్రవారం ఉదయం ఎస్ఎల్‌బీసీ సొరంగ ప్రమాదం జరిగింది. అంటే నేటికీ 6వ రోజు.
గత 5 రోజులుగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, జీఎస్ఐ, ఉత్తరాఖండ్ నుంచి వచ్చిన ర్యాట్ మైనింగ్, ఐఐటి మద్రాస్, ఎల్ అండ్ టి, మేఘా, నవయుగ తదితర అనేక సహాయ బృందాలు ఘటనా స్థలం చేరుకోవడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.
చిట్ట చివరి ప్రయత్నంగా ఇండియన్ మెరైన్ కమాండో ఫోర్స్‌కు చెందిన మార్కోస్ బృందం నేడు రంగంలో దిగనుంది. ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులు, వాతావరణంలోనైనా సహాయ చర్యలు చేపట్టడం మార్కోస్ ప్రత్యేకత.
లెఫ్టినెంట్ కల్నల్ హరిపాల్ సింగ్ ఆధ్వర్యంలో మార్కోస్ బృందం ఈరోజు ఎస్ఎల్‌బీసీ చేరుకొని, లోపల చిక్కుకున్నవారిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఇప్పటికే 5 రోజులలో అందరూ అన్నిరకాలుగా ప్రయత్నించి చూసి విఫలమయ్యారు. కనుక మార్కోస్ బృందం చేపట్టబోయే ‘ఆపరేషన్ మార్కోస్’ ప్రయత్నమే చిట్టచివరి ప్రయత్నం కావచ్చు.
సొరంగం గోడలు ఇప్పటికే నీటిలో నాని చాలా చెమ్మగిలి ఉన్నాయి కనుక టన్నల్ బోరింగ్ యంత్రాన్ని బయటకు లాగే ప్రయత్నం చేస్తే సొరంగం గోడలు కూలిపోయే ప్రమాదం ఉంటుందని ఇన్ని రోజులు ఆగారు. కానీ ‘ఆపరేషన్ మార్కోస్’ కూడా విఫలమైతే ఇక వేరే అవకాశం ఉండదు.
కనుక లోపల చిక్కుకున్న టన్నల్ బోరింగ్ యంత్రాన్ని క్రేన్ సాయంతో బయటకు లాగే ప్రయత్నం చేయవచ్చు. అప్పుడు సొరంగం మరికొంత కూలిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక ఇక లోపల చిక్కుకున్న ఎవరూ ప్రాణాలతో బయటపడే అవకాశం లేన్నట్లే భావించవచ్చు.