తెలంగాణకు టెస్లా తెస్తే చాలు...

February 23, 2025


img

ఇటీవల సిఎం రేవంత్ రెడ్డి బృందం దావోస్‌ సదస్సుకి హాజరయ్యి రాష్ట్రానికి సుమారు రూ.1.73 లక్షల కోట్లు పెట్టుబడులు ఆకర్షించగలిగింది. తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులకు చాలా అనుకూలమైనదని పెట్టుబడిదారులకు, ప్రపంచదేశాలకు దీంతో ఓ పాజిటివ్ సిగ్నల్ పంపిన్నట్లయింది. కనుక దీనిని మరోసారి నిరూపించేందుకు తెలంగాణ ప్రభుత్వానికి టెస్లా రూపంలో మరో అవకాశం లభించింది.   

అమెరికాకు చెందిన టెస్లా భారత్‌లో ఎలెక్ట్రిక్ కార్ల ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. దాని కోసం అప్పుడే మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. ఇవేకాక ఒడిశా, యూపీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాలు కూడా పోటీ పడుతున్నాయి. కనుక టెస్లాని తెలంగాణకు సాధించుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. చాలా గట్టి ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. 

తెలంగాణకి అన్ని విదాల అభివృద్ధి చెందిన హైదరాబాద్‌ నగరం, దానిలో అనేక పరిశ్రమలు, ఐటి కంపెనీలు  ఉండటం కలిసివచ్చే అంశం. ముఖ్యంగా హైదరాబాద్‌లో అమెరికన్ కౌన్సిలేట్ ఉండటం ప్లస్ పాయింట్.

కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం గట్టిగా ప్రయత్నించి టెస్లాని రాష్ట్రానికి సాధించగలిగితే, తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని వాహన తయారీ కంపెనీలు తరలివస్తాయి. వాటితో నగరం మరింతగా అభివృద్ధి చెందుతుంది. మరి సిఎం రేవంత్ రెడ్డి టెస్లాని తెలంగాణకు సాధించగలరా? చూద్దాం!


Related Post