కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్ ఈ నెల 24 నుంచి మళ్ళీ విచారణ ప్రారంభించనుంది. విచారణలో ఇప్పటికే పలువురిని ప్రశ్నించి వారి వాంగ్మూలాలు రికార్డ్ చేసినప్పటికీ ఇంకా మరికొందరు అధికారులు, ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉన్నవారిని ప్రశ్నించాల్సి ఉంది. కనుక కమీషన్ గడువు ఏప్రిల్ వరకు ప్రభుత్వం పొడిగించింది.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మింపజేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఈ ప్రాజెక్టు పనులను నిరంతరం పర్యవేక్షించిన మాజీ సాగునీటిశాఖ మంత్రి హరీష్ రావులకు కూడా నోటీసులు పంపించి ప్రశ్నించనుంది.
వారు విచారణకు హాజరై కాళేశ్వరం ప్రాజెక్టులో ఎటువంటి అవకతవకలు జరుగలేదని గట్టిగా వాదించగలిగితే ఈ కేసు నుంచి బయటపడగలరు.
కానీ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలలో అవకతవకలపై ప్రశ్నించేందుకు జస్టిస్ నరసింహ రెడ్డి కమీషన్ నోటీస్ పంపిస్తే రాకుండా, కమీషన్‌కు అసలు విచారణ జరిపే అర్హత లేదంటూ కేసీఆర్ సుప్రీంకోర్టులో కేసు వేశారు. కనుక ఈ కేసులో కూడా అలాగే చేయవచ్చు.
సాంకేతిక అంశాలతో ముడిపడున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలలో అవకతవకలు జరిగాయని నిరూపించడం చాలా కష్టం. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్ క్రుంగిపోవడం, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల గోడలు దెబ్బ తినడం వంటి ప్రత్యక్ష సాక్ష్యాలు కంటికి కనిపిస్తున్నాయి.
కనుక ఈ కేసులో అవకతవకలు జరిగాయని నిరూపించడం సాధ్యమే. కానీ ఎఫ్-1 రేసింగ్ కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసులో అన్ని సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ, రాజకీయ కోణంలో ఆలోచించి కేసీఆర్, కేటీఆర్‌లపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడిన ప్రభుత్వం ఈ కేసులో చర్యలు తీసుకుంటుందా?డౌటే!