కేసీఆర్ దాదాపు పదేళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు. బిఆర్ఎస్ పార్టీకి అధినేతగా ఉన్నారు. గజ్వేల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కనుక శాసనసభ సమావేశాలకు హాజరవ్వాల్సిన నైతిక బాధ్యత ఆయనకుంది.
శాసనసభ సమావేశాలకు హాజరవ్వాలని సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా కేసీఆర్ హాజరవడం లేదు. కనీసం స్పీకర్ నుంచి అనుమతి కూడా తీసుకోలేదు. కనుక ఆయన అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ని ఆదేశించవలసిందిగా కోరుతూ విజయ్ పాల్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. దానిని హైకోర్టు పరిశీలించి విచారణకు అర్హమైనదని భావిస్తే విచారణ చేపడుతుంది.
ఓ పక్క బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేత 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయిస్తే, కేసీఆర్‌పైనే అనర్హత వేటు వేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలవడం విశేషం.
ఒకవేళ హైకోర్టు ఈ పిటిషన్ విచారణకు స్వీకరించి సంజాయిషీ కోరుతూ కేసీఆర్‌కి నోటీస్ పంపిస్తే ఏమని సమాధానం చెప్పుకుంటారో?