మోడీ-ట్రంప్ భేటీ జరుగుతుండగానే..

February 14, 2025


img

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌, ప్రధాని మోడీ వైట్ హౌసులో భేటీ అయ్యారు. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైన తర్వాత అన్ని దేశాలకి ఇబ్బంది కలిగించే నిర్ణయాలు అమలుచేస్తుండటంతో ఆయనతో ప్రధాని మోడీ భేటీకి చాలా ప్రాధాన్యత ఏర్పడింది.

ఈ సమావేశంలో ప్రధాని మోడీతో పాటు భారత్‌ విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబల్ పాల్గొన్నారు. 

ట్రంప్-మోడీ మా మద్య బలమైన స్నేహ బంధం ఉందని, ఇరుదేశాల మద్య ద్వైపాక్షిక సంబంధాలు బలంగా ఉన్నాయని, రాబోయే రోజుల్లో అవి మరింత బలపడతాయని వారిరువురూ మీడియాకు చెపుతున్న సమయానికే అమెరికా నుంచి మరో 180 మంది అక్రమ వలసదారులతో మిలటరీ విమానం భారత్‌కు బయలుదేరింది. దాని వెనుకే మరో 150-200 మందితో మరో విమానం కూడా బయలుదేరబోతోంది. 

అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారిని వెనక్కు తిప్పి పంపడాన్ని భారత్‌ కూడా తప్పు పట్టలేదు. కనుక ప్రధాని మోడీ ఈ విషయం గురించి ప్రెసిడెంట్ ట్రంప్‌పై ఒత్తిడి చేయలేరు.

కానీ ట్రంప్ అమెరికా పగ్గాలు చేపట్టగానే పలుదేశాల ఎగుమతులపై భారీగా పన్నులు పెంచుతున్నారు. హెచ్-1బీ వీసాలపై మళ్ళీ ఆంక్షలు విధించాలని భావిస్తున్నారు. కనుక ట్రంప్ దుందుడుకు నిర్ణయాల వలన భారత్‌కు, ఎన్‌ఆర్‌ఐలకు, అమెరికాకు ఐటి సేవలు అందిస్తున్న భారతీయ ఐటి కంపెనీలకు నష్టం తగ్గించేందుకు ఈ భేటీ ఎంతో కొంత ఉపయోగపడవచ్చు.

చాలా దూకుడుగా వ్యవహరించే డోనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని మోడీ స్నేహంగా వ్యవహరిస్తూ లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవడం తప్ప మరోదారి లేదు. కనుక రాబోయే రోజుల్లో భారత్‌ విషయంలో ట్రంప్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో చూస్తే ప్రధాని మోడీ దౌత్యం ఫలించిందో లేదో తెలుస్తుంది. 


Related Post