కులగణన సర్వేపై ప్రతిపక్షాలు, బీసీ సంఘాలు మండి పడుతుండటంతో తొలి జాబితాలో వివరాలు నమోదు చేయనివారి మళ్ళీ సర్వే కొనసాగించాలని నిర్ణయించింది. ఓ పక్క ఆ వివాదం కొనసాగుతుండగానే కాంగ్రెస్ ప్రభుత్వం హటాత్తుగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అంశాన్ని తెరపైకి తేవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “కామారెడ్డి కాంగ్రెస్ డిక్లరేషన్‌లో విద్య, ఉద్యోగాలలో బీసీలకు 42శాతం రిజర్వేషన్స్ ఇస్తామని ప్రకటించాము. దానికి మా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. మార్చి మొదటి వారంలో శాసనసభ ప్రత్యేక సమావేశం నిర్వహించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని తీర్మానం చేస్తాము. దానిని కేంద్రానికి పంపి రాజ్యాంగ సవరణ చేసి పార్లమెంటులో ఆమోదింపజేయాలని కోరుతాము.
శాసనసభలో తీర్మానం ఆమోదించి పంపిన తర్వాత సిఎం రేవంత్ రెడ్డి స్వయంగా కలిసివచ్చే పార్టీల నేతలను వెంటబెట్టుకొని ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోడీకి వినతి పత్రం ఇస్తారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కేంద్రం అంగీకరించకపోతే దేశంలో కలిసివచ్చే అన్ని పార్టీలతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ సాధించేందుకు పోరాడుతాము. కుల గణన సర్వేలో రాష్ట్రంలో బీసీ జనాభా 56 శాతం ఉందని తేలింది. కనుక జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం న్యాయం. బీసీలకు రిజర్వేషన్స్ సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎంత వరకైనా పోరాడుతుంది,” అని భట్టి విక్రమార్క అన్నారు.
అన్ని వర్గాలకు కలిపి రిజర్వేషన్లు 50%కి మించకూడదని రాజ్యాంగం చెపుతోంది. సుప్రీంకోర్టు కూడా అదే చెపుతోంది. కానీ ఒక్క బీసీలకె 42% రిజర్వేషన్లు కేటాయిస్తే, మిగిలిన వర్గాలన్నిటికీ ఏ లెక్కన రిజర్వేషన్స్ ఇవ్వగలదు. అన్ని వర్గాలు తమకు రిజర్వేషన్ల శాతం పెంచాలని ఒత్తిడి చేస్తే పెంచగలదా? ముఖ్యంగా దీని కోసం దేశంలో అన్ని పార్టీలను ఒప్పించడం, రాజ్యాంగ సవరణ చేయడం దాదాపు అసాధ్యమే.