కేసీఆర్ తొలిసారి ముఖ్యమంత్రికాగానే రాష్ట్రంలో తన అధికారానికి, తన పార్టీకి ఎదురే ఉండొద్దని కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను, సీనియర్ నేతలు తన పార్టీలోకి ఫిరాయించుకున్నారు. తెలంగాణ కోసం ఉద్యమాలు చేసిన వారిని కాదని ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కూడా ఇచ్చారు.
ఏమంటే బంగారి తెలంగాణ సాధన కోసం అని తన అప్రజాస్వామ్య పోకడలని సమర్ధించుకునే వారు. మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు అలాగే చేశారు. పార్టీ ఫిరాయించిన ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్, టీడీపీలు కోరినా కేసీఆర్ పట్టించుకోలేదు.
ఇప్పుడు అదే కేసీఆర్ పార్టీ ఫిరాయించిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలని తప్పు పడుతున్నారు. వారిపై అనర్హత వేటు వేయాలని తన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేత హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసులు వేయించి న్యాయపోరాటాలు చేయిస్తున్నారు కూడా. అంటే తాను చేస్తే సంసారం ఇతరులు చేస్తే వ్యభిచారం అన్నట్లుంది కేసీఆర్ ధోరణి.
ఈరోజు స్టేషన్ ఘన్‌పూర్‌కి చెందిన ఇతర పార్టీ నేతలకు కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నప్పుడు, “పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయక తప్పదు. ఉప ఎన్నికలు జరుగక తప్పదు. అప్పుడు ప్రజలే వారికి బుద్ధి చెపుతారు,” అన్నారు.
ఓ పక్క ఇతర పార్టీ నేతలని బిఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకుంటూ కేసీఆర్ ఈవిదంగా మాట్లాడటం ఇంకా విడ్డూరం ఉంది. ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రతిపక్షాలను నామరూపాలు లేకుండా తుడిచి పెట్టేయాలనుకున్న కేసీఆర్‌కి ఫిరాయింపులు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేందుకు నైతిక హక్కు ఉంటుందా?