కాంగ్రెస్‌లో తెలంగాణ జన సమితి విలీనం.. కాబోతోందా?

February 09, 2025


img

తెలంగాణ ఉద్యమాలలో బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌తో భుజం భుజం కలిపి పనిచేసిన ప్రొఫెసర్ కోదండరామ్‌కి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ ప్రభుత్వంలో కీలక పదవి తప్పక లభిస్తుందని అందరూ భావించారు. కానీ కేసీఆర్‌ ఆయనని పట్టించుకోలేదు. 

టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు, ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకొని వారికి మంత్రి పదవులు ఇచ్చారు. ఆ తర్వాత కూడా సుమారు 1400 మంది తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాలనే ప్రొఫెసర్ కోదండరామ్‌ విజ్ఞప్తిని పట్టించుకోకుండా 5-600 మందికి మాత్రమే లబ్ధి కల్పించారు. అప్పటి నుంచే ప్రొఫెసర్ కోదండరామ్‌ కేసీఆర్‌కి దూరం కాసాగారు. 

కేసీఆర్‌ ఆ దూరం తగ్గించే ప్రయత్నం చేయకుండా ఆయన పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మరింత దూరం పెరిగేలా చేశారు. కేసీఆర్‌ పక్కా రాజకీయ నాయకుడుగా మారిపోవడంతో ప్రొఫెసర్ కోదండరామ్‌ తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడేందుకు తెలంగాణ జన సమితిని ఏర్పాటు చేశారు. 

అయితే ఆ పార్టీ బిఆర్ఎస్ పార్టీని ఎన్నికలలో ఎదుర్కోలేకపోతున్నా, కేసీఆర్‌ తీరుని ఎండగడుతూ ప్రజలలో మంచి గుర్తింపు సంపాదించుకోగలిగింది. 

కాంగ్రెస్ నేతలతో మొదటి నుంచి సత్సంబంధాలున్న ఆయన 2023 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారు. కాంగ్రెస్‌ విజయం సాధించిన తర్వాత సిఎం రేవంత్ రెడ్డి ఆయనకు సముచిత గౌరవం కల్పిస్తూ గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. ప్రభుత్వ విధానాల విషయంలో సిఎం రేవంత్ రెడ్డి ఆయన సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు కూడా. 

కనుక ఇక తెలంగాణ జన సమితిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే బాగుంటుందని అటు కాంగ్రెస్‌, ఇటు సమితి నేతలు కూడా ప్రొఫెసర్ కోదండరామ్‌ని కోరుతున్నారు. అందుకు ఆయనకి కూడా ఎటువంటి అభ్యంతరం లేకపోవడంతో విలీనంపై చర్చలు మొదలయ్యాయి. కనుక త్వరలో కాంగ్రెస్‌లో తెలంగాణ జన సమితి విలీనం కాబోతోంది. 


Related Post