లోక్‌సభ ఎన్నికలలో గెలిచి ఢిల్లీ పీఠం మరోసారి దక్కించుకున్న బీజేపి, ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో విజయకేతనం ఎగురవేసి శాసనసభని కూడా కైవసం చేసుకోబోతోంది.
ఈరోజు ఉదయం 8 గంటల ఓట్ల లెక్కింపు మొదలవగా మొదట బీజేపి, ఆమాద్మీ పార్టీల ఆధిక్యతలు పోటాపోటీగా సాగినప్పటికీ క్రమంగా ఆమాద్మీ పార్టీ వెనుకబడిపోతుంటే, బీజేపి పూర్తి ఆధిక్యంలోకి వచ్చేసింది. ఈరోజు ఉదయం 10.30 గంటల వరకు పూర్తయిన లెక్కింపులో బీజేపి 40 స్థానాల ఆధిక్యంలో దూసుకుపోతుండగా, ఆమాద్మీ పార్టీ 30 స్థానాల వద్ద ఆగిపోయింది.
మొత్తం 70 స్థానాలున్నాయి కనుక మ్యాజిక్ ఫిగర్ 37 కాగా బీజేపి 40 సీట్ల ఆధిక్యంలో ఉంది. అది బహుశః మరికొన్ని సీట్లు పెరిగే సూచనలు కనబడుతున్నాయి. కనుక ఈసారి ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో బీజేపి గెలుపు ఖాయమే. మద్యాహ్నం 12 గంటలలోగా మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఈ ఓటమి ఆమాద్మీ పార్టీకి, ముఖ్యంగా దాని అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కి పెద్ద ఎదురుదెబ్బ కాగా, ఢిల్లీ పీఠం కోసం బీజేపి ఎన్నో ఏళ్ళుగా ప్రయత్నిస్తున్నందున ఈ గెలుపు దానికి చాలా అపూర్వమైనదే.
ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుందని ఎగ్జిట్ పోల్స్ ముందే సూచించాయి. ఇప్పటి వరకు ఒక్క స్థానంలో కాంగ్రెస్ ఆధిక్యం సాధించలేదు. కనుక వాటి అంచనాలు నిజం కాబోతున్నాయి.